Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది. రోజుకో ఘట్టంతో నాలుగు రోజుల పాటు తాడ్వాయి అడవి సమ్మక్క-సారలమ్మ స్మరణలతో మార్మోగనుంది. ప్రపంచంలోనే అరుదైన గిరిజన జాతరగా దీనికి పేరుంది. ఒక గిరిజన జాతరకు కోట్లలో భక్తులు రావడం మేడారంలోనే జరుగుతుంది. మేడారం జాతరకు తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. కాలినడకన, ఎడ్లబండ్లతో పాటు హెలికాప్టర్ లోనూ ఈ గిరిజన జాతరకు వస్తున్నారంటే సమ్మక్క, సారలమ్మ విశిష్టత ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.
నాలుగు రోజు కీలక ఘట్టాలు ఇవే..
అశేష భక్త జనవాహిని సందోహంలో సారలమ్మ బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి గద్దెకు చేరుకోవడంతో జాతర లాంచనంగా ప్రారంభం అవుతుంది. సమ్మక్కతో పాటు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరుకుంటారు. ఇక రెండో రోజైన గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను సర్కారు లాంఛనాలతో భక్తుల జయజయ ధ్వానాల మధ్య గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క రాకతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. మూడో రోజై శుక్రవారం సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్లు చూసేందుకు భక్తజనం పోటెత్తుతారు. నాలుగో రోజై శనివారం సారలమ్మ, సమ్మక్కలు గద్దెల నుంచి తిరుగుపయనం అవుతారు. దీంతో జాతరం ముగుస్తుంది.
మోదీ ట్వీట్.. 23న రాష్ట్రపతి రాక
మేడారం జాతర బుధవారం ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి అని మోదీ అన్నారు. భక్తి, సంప్రదాయాల కలయిక అయిన సమ్మక్క-సారక్కకు ప్రణమిల్లుదామని మోదీ పిలుపునిచ్చారు. సమ్మక్క-సారక్కల ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడారం రానున్నారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు కూడా సమ్మక్క, సారక్కలను దర్శించుకోనున్నారు.