నేడు మేఘాలయ, నాగాలాండ్ ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం; ప్రధాని మోదీ హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్‌డీపీ చీఫ్ నీఫియు రియో, ఎన్‌పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా నాగాలాండ్, మేఘాలయ ముఖ్యమంత్రులుగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నీఫియు రియో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో ఆయన బీజేపీ మద్దతుతో వరుసగా ఐదవసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టబోతున్నారు.
60మంది సభ్యులున్న అసెంబ్లీలో ఎన్‌డీపీ-బీజేపీ కూటమి 37సీట్లు సాధించడంతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
నాగాలాండ్ అసెంబ్లీ చరిత్రను తిరగరాస్తూ.. తొలిసారి ఈ సారి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నిక కావడం గమనార్హం.
మేఘాలయ
రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్న సంగ్మా
మేఘాలయలో ఎన్‌పీపీ చీఫ్ సంగ్మా నేతృత్వంలోని కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
మొత్తం 60స్థానాలుకు అసెంబ్లీ ఎన్నికలు జరగగ్గా ఎన్‌పీపీ 26 స్థానాలను గెల్చుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. వరుసగా రెండోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్ఠంచబోతున్నారు.
యూడీపీ 11 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది. గత అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్న తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ఐదు సీట్లు వచ్చాయి.
బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు చెరో రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీకి నాలుగు సీట్లు వచ్చాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.