మేఘాలయలో 45కు చెరిన సంగ్మా బలం; నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం
మేఘాలయ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సోమవారం తొలిసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన 59 మంది సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఎన్‌పీపీ-బీజేపీకి కూటమికి 32మంది సభ్యులు ఉండేవారు. రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ), పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ఆదివారం కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) కూటమికి తమ మద్దతును అందించాయి. దీంతో సంగ్మాకు మద్దతిచ్చే వారి సంఖ్య 45 పెరిగింది. స్పీకర్ ఎన్నిక కోసం మార్చి 9న అసెంబ్లీ మళ్లీ సమావేశం కానుంది.
ఈనెల 7, 8న మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలో మోదీ పర్యటన
గత నెలలో ఎన్నికలు జరిగిన ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపురలను మంగళవారం, బుధవారాల్లో ప్రధాని మోదీ సందర్శించి ముఖ్యమంత్రులు, ఇతర నేతల ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొనున్నారు. ఇదిలా ఉంటే, ఖాసీ నేటివిస్ట్ గ్రూపులు తమ సామాజికవర్గం నుంచి సీఎం కావాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సంగ్మాకు మద్దతిస్తున్న నేటివిస్ట్ గ్రూపుకు చెందిన హెచ్‌ఎస్‌పీడీపీ ఎమ్మెల్యే మెథోడియస్ డిఖార్ కార్యాలయానికి ఆ సామాజికవర్గానికి చెందిన వారు నిప్పు పెట్టారు.