బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మాదాల్ ఇంట్లో 6కోట్ల రూపాయల నగదును శుక్రవారం ఉదయం లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రశాంత్ మాదాల్‌ను అరెస్టు చేశారు.
ప్రశాంత్ మాదాల్ తన కార్యాలయంలో రూ.40లక్షల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ పనులకోసం లంచం తీసుకున్నాడంటూ ప్రశాంత్‌పై ఓ వ్యక్తి గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్వ అవినీతి నిరోధక విభాగం లోకాయుక్త అధికారులు ఆయన నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
కర్ణాటక
ఎమ్మెల్యేను కూడా విచారణకు పిలిచే అవకాశం
ప్రశాంత్ మాదాల్ కార్యాలయంలో రూ.40 లక్షల లంచంతోపాటు మరో రూ.1.7 కోట్లను లోకాయుక్త గుర్తించింది. శుక్రవారం ఉదయం ప్రశాంత్ మాదాల్ నివాసంలో మరో రూ.6 కోట్లను గుర్తించారు.
ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్పను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.
మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అవినీతి ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.