Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనే మూడు ప్రధాన నగరాలు ఉన్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి నాల్గవ నగరంగా "ఫ్యూచర్ సిటీ"ని అభివృద్ధి చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల ప్రాంతాల్లో ఈ నగరాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించటం, స్పోర్ట్స్, మెడికల్ హబ్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ వెల్లడించారు. తాజాగా, ఫ్యూచర్ సిటీకి హైదరాబాద్ నగరం నుంచి రాకపోకలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ దిశగా ఉన్నతాధికారులు నాలుగు మార్గాలను సూచించారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునే మార్గాలపై ప్రణాళికలు రూపొందించారు.
మెట్రో ట్రైన్ రెండో దశలో ఐదు కారిడార్లు
ఈ దిశగా ఉన్నతాధికారులు నాలుగు మార్గాలను సూచించారు.శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునే మార్గాలపై ప్రణాళికలు రూపొందించారు. ఇందులో రెండు మార్గాలు మెట్రో ట్రైన్‌కు సంబంధించి,మరొక రెండు ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి ఉన్నాయి. ప్రస్తుతం 69కి.మీ. పొడవుతో మూడు కారిడార్ల మెట్రో ట్రైన్ మొదటి దశ నిర్మాణం పూర్తయ్యి,నగర ప్రజలకు అందుబాటులో ఉంది. మెట్రో ట్రైన్ రెండో దశ 78.4 కి.మీ. పొడవుతో ఐదు కారిడార్లను అందుబాటులోకి తెస్తుంది.ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్టు,హైదరాబాద్ నగరంలోని మెట్రో రహదారుల మధ్య కనెక్షన్ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని,రేవంత్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ అభివృద్ధిపై ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ప్రాజెక్టులో స్కిల్ యూనివర్సిటీని కూడా నిర్మించనున్నట్లు ప్రకటించారు.
ఒకటి రావిర్యాల మార్గంలో.. మరోటి తుక్కుగూడ మీదుగా..
ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో మార్గాల ఆప్షన్లను అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రావిర్యాల మీదుగా ఒక మార్గం సూచించగా,తుక్కుగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరొక మార్గం ప్రతిపాదించారు. శ్రీశైలం రోడ్డు మీదుగా ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 32 కి.మీ దూరంతో ఒక మార్గాన్ని ప్రతిపాదించారు. ఇందులో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.నిర్మాణ వ్యయం రూ. 6,173 కోట్లు.రావిర్యాల మీదుగా మరో మార్గం 32.4 కి.మీ దూరంతో,10 స్టేషన్లు ప్రతిపాదించారు. నిర్మాణ వ్యయం రూ. 5,216 కోట్లు. త్వరలోనే వీటిపై ప్రభుత్వం ఒక అంచనాకు రానున్నట్లు సమాచారం.