
Minister Lokesh: 'అనంత'లో రూ.22 వేల కోట్లతో పునరుత్పాదక విద్యుత్తు కాంప్లెక్స్.. రేపు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం జిల్లాలోని గుత్తి మండలానికి చెందిన బేతపల్లిలో దేశంలోనే అత్యంత పెద్దదైన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
దాదాపు రూ.22 వేల కోట్ల భారీ పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును 'రెన్యూ విక్రమ్‌శక్తి ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ అభివృద్ధి చేయనుందని పేర్కొంది.
ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమాన్ని మే 17వ తేదీన రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టనున్నారు.
వివరాలు
'దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సదస్సులో మంత్రి లోకేశ్, రెన్యూ గ్రూప్ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక రకాల ప్రోత్సాహకాలను పొందేందుకు పునరుత్పాదక విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో విస్తృతంగా పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన 'దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం' సదస్సులో మంత్రి లోకేశ్, రెన్యూ గ్రూప్ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు జరిగాయని, వాటి ఫలితంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.
దాదాపు ఆరు సంవత్సరాల విరామం తరువాత రెన్యూ సంస్థ తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు.
వివరాలు
415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ కేంద్రాల ఏర్పాటు
ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల వాయు విద్యుత్,415 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.
ఈ దశకే సుమారు రూ.7,000కోట్లు పెట్టుబడిగా ఖర్చు చేయనుంది. భవిష్యత్‌లో ఈ ప్రాజెక్టును మరింత విస్తరించనున్నఈ సంస్థ, మొత్తంగా 1,800మెగావాట్ల సౌర విద్యుత్, 1,000మెగావాట్ల వాయు విద్యుత్, 2,000మెగావాట్ల బ్యాటరీ నిల్వ సామర్థ్యం కలిగిన యూనిట్లుగా అభివృద్ధి చేయనుందని తెలిపింది.
ఇదిలా ఉండగా, 2019కి ముందుగా రెన్యూ సంస్థ రాష్ట్రంలో 777మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ,వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పీపీఏల(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు)రద్దు చేయడంతో ఆప్రాజెక్టులు అమలుకావడం సాధ్యపడలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
ఐదేళ్ల కాలంలో 72,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్
ప్రస్తుతం బేతపల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుండి తీసుకున్న భూములకు వార్షికంగా ప్రతి ఎకరాకు రూ.31,000 లీజ్ ఇవ్వనుండగా, ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి 5 శాతం లీజ్ పెంపు ఉంటుందని ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు.
దావోస్ సదస్సులో జరిగిన చర్చల సమయంలో పునరుత్పాదక విద్యుత్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహాలను మంత్రి లోకేశ్ రెన్యూ సంస్థకు వివరించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఉద్దేశ్యం వచ్చే ఐదేళ్ల కాలంలో మొత్తం 72,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేయడం అని పేర్కొన్నారు.