
Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో ఫ్యామిలీ కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లాలోని 13 గ్రామాలు, 15 మున్సిపాలిటీల్లోని 15 వార్డుల్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీ చేపట్టారు.
ప్రతి కుటుంబానికి ఆధార్ కార్డు మాదిరి డిజిటల్ కార్డు ఇవ్వాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
కరీంనగర్ కలెక్టర్ ప్రమీల సత్పతి సమక్షంలో, మంత్రి పలు ఇళ్ళకు స్వయంగా వెళ్లి వివరాలు నమోదు చేశారు.
ఈ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య, గుర్తింపు ఫోటో వంటి వివరాలు సేకరించబడుతాయని మంత్రి వివరించారు.
వివరాలు
డిజిటల్ కార్డుల ప్రాముఖ్యత
పైలట్ ప్రాజెక్ట్‌లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామం, మునిసిపాలిటీలో ఒక వార్డును ఎంపిక చేసి డిజిటల్ కార్డుల పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు.
ఈ కార్డు రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పింఛన్ వంటి అన్ని ప్రభుత్వ పథకాలకూ ప్రామాణికంగా ఉంటుందని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ కార్డును ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేశారు.
డిజిటల్ గుర్తింపు కార్డులను ఫ్యామిలీ పెద్దగా ఉండే మహిళా పేరుతోనే జారీ చేయడం జరుగుతుందని, ఈ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇళ్ళు, పింఛన్లు వంటి పథకాలను పొందవచ్చని మంత్రి తెలిపారు.
డిజిటల్ కార్డులు ఇప్పటికే కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయని చెప్పారు.
వివరాలు
బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
బిఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తామని, త్వరలోనే వాటి పంపిణీ జరుపుతామని పేర్కొన్నారు.
రేషన్ కార్డులతో పాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కూడా ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
రైతుల పంట రుణమాఫీ
రైతులకు పంట రుణాలు మాఫీ చేసే విషయమై, 2 లక్షల రూపాయల పైగా రుణం ఉన్న రైతులకు దసరా నాటికి రుణమాఫీ ఉంటుందని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న వారు తమ వివరాలను అధికారులకు ఇవ్వాలని కోరారు.
వివరాలు
చేప పిల్లల పంపిణీ
మత్స్యకారుల అభివృద్ధి కోసం 29వేల చెరువుల్లో చేప పిల్లల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా చేపడతామని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లుల కారణంగా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైందని వివరించారు.
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌లో 60 లక్షల చేప పిల్లలను మంత్రి, స్థానిక నాయకులతో కలిసి విడుదల చేశారు.