New Ration cards: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ ఇచ్చిన మంత్రి.. కొత్త కార్డుల్లో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్త. త్వరలో రేషన్ కార్డుల వ్యవస్థలో కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇకపై రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉండనున్నాయని తెలిపారు. అంతేకాక, రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చారు.
వివరాలు
రేషన్ కార్డుల విభజన
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 2.8 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుగా ఇప్పటికే ఉన్నారని తెలిపారు.
అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తుందని స్పష్టం చేశారు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి బీపీఎల్ (Below Poverty Line) కార్డులు, ఎగువన ఉన్నవారికి ఏపీఎల్ (Above Poverty Line) కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.
ఇప్పటికే ఉన్న విధానంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ట్రైకలర్ డిజైన్‌లో బీపీఎల్ కార్డులు, గ్రీన్ కలర్‌లో ఏపీఎల్ కార్డులు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.
వివరాలు
స్మార్ట్ కార్డుల ఆవిష్కరణ
కొత్త రేషన్ కార్డుల విధానంలో భాగంగా,కొత్త లబ్ధిదారులతో పాటు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారికి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈకార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచిందని,ఈప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీని ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశముందని తెలిపారు.
గతంలో పింక్ రేషన్ కార్డు కలిగిన వారికి గ్రీన్ కార్డు,తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ట్రైకలర్ కార్డు అందజేయనున్నట్లు మంత్రి వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త,పాత రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉండేలా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
వివరాలు
స్మార్ట్ రేషన్ కార్డుల ప్రత్యేకతలు
ఈ కొత్త స్మార్ట్ కార్డుపై:
మొదటి భాగంలో: ప్రభుత్వ లోగో,కుటుంబ పెద్ద వివరాలు,హోలోగ్రామ్
రెండో భాగంలో: కార్డుదారుడి పూర్తి చిరునామా,క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు.ఈ ప్రాజెక్ట్ కోసం పౌరసరఫరాల శాఖ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది.
టెండర్ దాఖలుకు మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది.
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి 1 కోటి స్మార్ట్ రేషన్ కార్డులు,దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించేందుకు పౌరసరఫరాల శాఖ టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.
ఇటువంటి కొత్త మార్పులతో రేషన్ కార్డు విధానం మరింత పారదర్శకంగా మారనుంది.