
Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
శిల్పకళా వేదికపై గురువారం జరిగిన మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు తమ సృజనాత్మకతను,నైపుణ్యాలను ప్రదర్శించారు.
మొత్తం 24దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకతను చాటేలా ప్రదర్శనలు ఇస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు.
ఈకార్యక్రమంలో ఇండోనేషియాకు చెందిన మోనికా కేజియా సెంబిరింగ్ పియానో వాయిస్తూ పాటపాడిన విధానం అందరినీ ఆకట్టుకుని మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
రెండో స్థానంలో మిస్ కామెరూన్ ఇస్సే ప్రిన్సెస్ నిలిచారు.ఇటలీకి చెందిన చైరా ఎస్పోసిటీ తన శ్రావ్యమైన బ్యాలే నృత్యంతో మూడో స్థానంలో నిలిచారు.
మొత్తం మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమం కళారూపాల ఆవిష్కరణకు వేదికైంది. పోటాపోటీగా సాగిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
వివరాలు
ఇతర దేశాల ప్రత్యేక ప్రదర్శనలు
ఫినాలేలో మిస్ నైజీరియా ఆమె ఇండో-ఆఫ్రికన్ డ్యాన్స్‌తో అలరించగా,శ్రీలంకకు చెందిన పోటీదారు తమ దేశ సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.
నెదర్లాండ్స్‌కు చెందిన సుందరి ఐస్ స్కేటింగ్‌లో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చెక్ రిపబ్లిక్‌కు చెందిన అందగత్తె పియానో వాయించి సంగీత ప్రదర్శన ఇచ్చారు.
బ్రెజిల్ అందగత్తె కథలపై తన ఆసక్తిని 'ఐ లవ్ స్టోరీస్' అనే పాట ద్వారా చూపించారు. అర్జెంటీనా సుందరి అర్బన్ డ్యాన్స్ ప్రదర్శించగా, ఎస్తోనియా అందగత్తె ఫ్లోర్ డ్యాన్స్‌తో మెప్పించారు.
అర్జెంటీనా పోటీదారు చేసిన అర్బన్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వేల్స్ కంటెస్టెంట్ సీపీఆర్ ఎలా చేయాలో వినూత్నంగా వివరించారు.
వివరాలు
నేడు హెడ్ టూ హెడ్ ఫైనల్..
ఆస్ట్రేలియాకు చెందిన అందగత్తె పాటతో ప్రేక్షకులను మైమరిపించారు. కెన్యా నుంచి వచ్చిన పోటీదారు డీజే ప్రదర్శనతో అందరినీ ఉర్రూతలూగించారు.
చివరిగా, 24 మంది అందగత్తెలు కలిసి 'రానూ బొంబయికి రానూ..' అనే ప్రాచీన తెలుగు జానపద గీతానికి సమిష్టిగా నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు.
మిస్ వరల్డ్ పోటీ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ట్రైడెంట్ హోటల్‌లో హెడ్ టూ హెడ్ ఫైనల్ జరగనుంది.
గత రెండు రోజులుగా టీ-హబ్‌లో జరిగిన నాలుగు గ్రూపుల ప్రదర్శనల ద్వారా ఎంపికైన పోటీదారులు ఇప్పుడు హెడ్ టూ హెడ్ ఫైనల్‌కు అర్హత పొందారు.
ఈ ఫైనల్ రౌండ్‌లో వారు తమ ప్రతిభను మరింతగా చూపనున్నారు.
వివరాలు
హైదరాబాద్‌లో సందడి చేసిన మిస్ వరల్డ్ అందగత్తెలు
గురువారం ఉదయం మాదాపూర్ శిల్పారామంలో ఐరోపా దేశాల సుందరీమణులు సందడి చేశారు.
రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి ఇందిరా మహిళా శక్తి బజార్‌లో ఉన్న స్టాళ్లను సందర్శించారు.
అదేరోజు సుమారు 60 మంది మిస్ వరల్డ్ పోటీదారులు సరూర్‌నగర్‌లోని చారిత్రక విక్టోరియా మెమోరియల్ హోమ్‌లో నడుస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై పలు కార్యకలాపాల్లో పాల్గొన్నారు.