
Miss World: భారత్‌కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో తనకు ఎంతో ఘనంగా స్వాగతం లభించిందని, ఈ దేశానికి తన హృదయంలో విశేషమైన ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
భారతదేశ సంస్కృతి, కళలు అపూర్వమైనవని, అవి గొప్పదనాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక్కడే తాను ఎంతో స్ఫూర్తి పొందుతున్నానని, సమాజపు విలువలను బోధించే దేశంగా భారతదేశాన్ని ప్రశంసించారు.
భిన్నత్వంలో ఏకత్వం అనేది అత్యంత గొప్ప భావన అని ఆమె వెల్లడించారు."భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నప్పటికీ, ప్రజలు ఒక్కటిగా ఉన్నారు. ఇదే భారతదేశ స్ఫూర్తి. మిస్ వరల్డ్ పోటీ కూడా ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే ఒక గుర్తింపుగా నిలుస్తుంది" అని క్రిస్టినా పిస్కోవా తెలిపారు.
వివరాలు
తెలంగాణకు 2,500 ఏళ్ల చరిత్ర: స్మితా సభర్వాల్
72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.మే నెలలో హైదరాబాద్‌లో ఈ పోటీలు జరగనున్నాయి.
తెలంగాణ త్రిలింగ దేశంగా విశేష ప్రాముఖ్యత కలిగి ఉందని,ఈ ప్రాంతానికి 2,500 ఏళ్ల పురాతన చరిత్ర ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ తెలిపారు.
రాష్ట్రం ఏర్పడి 11ఏళ్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఆమె వివరించారు.
రామప్ప దేవాలయం,వేయి స్తంభాల ఆలయం,చార్మినార్,గోల్కొండ కోట వంటి అపూర్వమైన కట్టడాలు ఈ ప్రాంత సమృద్ధి, భవ్యతకు నిదర్శనమని తెలిపారు.
మే నెలలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా నిర్వహించనున్నట్లు వివరించారు.
మెడికల్ టూరిజంలో తెలంగాణకు విశేష ప్రాధాన్యత ఉందని, సినిమా,ఆహార రంగాల్లో ఈ రాష్ట్రం ప్రత్యేకగుర్తింపు సాధించిందని ఆమె తెలిపారు.