Kavitha Press Meet : బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్..
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాష్ట్ర సమితి (BRS)లోని కొందరు సీనియర్ నేతలు తనపై కుట్ర చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు ఆమె చేసింది. భారత రాష్ట్ర సమితి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వివరాలు
మా కుటుంబం బలహీనంగా ఉంటే వారికి అధికారం
పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. ''మా కుటుంబం బలహీనంగా ఉంటే వారికి అధికారం వస్తుంది. మొదటి దశలో నన్ను బయటకు పంపించారు. అదిక్కడితో ఆగదు. నాన్నా (కేసీఆర్), మీ చుట్టూ జరుగుతున్న వాటిని గమనించండి. రేపటి రోజు ఇదే పరిస్థితి రామన్న (కేటీఆర్)కు, మీకూ ఎదురవుతుంది. భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకునే కుట్రలో నన్ను బయటకు పంపించారు'' అని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
అవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలా?
అక్రమ కేసులు పెట్టి తిహాడ్ జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గతేడాది నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత తెలిపారు. గురుకులాల సమస్య, బీసీ రిజర్వేషన్లు,మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలైనవి చేశాం. తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినపుడు గళమెత్తినట్లు చెప్పారు. బనకచర్ల, భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాము. సీఎం సొంత జిల్లాలో భూనిర్వాసితులకు మద్దతుగా ఉన్నాం. 47 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కలిపి, అనేక ప్రజాసమస్యలను పరిష్కరించడానికి గులాబీ కండువలతో మాట్లాడాము. ఈ కార్యక్రమాలు పార్టీ వ్యతిరేకం అవుతాయా?'' అని ప్రశ్నించారు. ఆమె ఈ అంశంపై BRS పెద్దలు పునరాలోచన చేయాలని సూచించారు.
వివరాలు
హరీశ్‌రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా?
''కాంగ్రెస్ వ్యతిరేకంగా బీసీ అంశంపై మాట్లాడినప్పుడు,పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. సామాజిక తెలంగాణకు అంకితభావంతో ఉంటానని నేను చెప్పాను.ఇందులో తప్పేముందు? నా తండ్రి కేసీఆర్ (KCR) చిటికెన వేలు పట్టుకుని నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడాను. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన నాయకుడు కేసీఆర్. ఆయన చెప్పిన విధంగా ఆచరణలోకి తెచ్చారు. ప్రతి కులాన్ని రక్షించడానికి ప్రయత్నించారు.ఇది సామాజిక తెలంగాణకాదా?నేను తప్పు చెప్పానా? సామాజిక తెలంగాణ BRSకి అవసరమే కాదా?భౌగోళిక తెలంగాణతో బంగారు తెలంగాణ అవుతుందా? హరీశ్‌రావు,సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా?'' అని ఆమె ప్రశ్నించారు.
వివరాలు
రామన్నా.. బుజ్జగించి అడుగుతున్నా..
నేను రామన్న (కేటీఆర్)ను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లి, మహిళా ఎమ్మెల్సీపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో వెల్లడించాను. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా? నేను కూర్చొని ప్రెస్‌మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే" అని కవిత తెలిపారు.