LOADING...
Rain Alert: తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్
తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్

Rain Alert: తెలంగాణకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరోసారి తన ప్రతాపాన్ని చూపనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రుతుపవనాల ఉత్సాహం పెరగడంతోపాటు వాయువ బంగాళాఖాతం, ఒడిశా ఉత్తర తీర, దక్షిణ గంగా తీర పశ్చిమ బెంగాల్‌ వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 9 సెంటీమీటర్లు వర్షం కురిసింది.

Details

ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం

అలాగే తాడ్వాయిలో 9 సెం.మీ, సదాశివనగర్‌లో 8 సెం.మీ, జుక్కల్‌లో 7 సెం.మీ, కామారెడ్డిలో 7 సెం.మీ, బిర్కూర్‌లో 6 సెం.మీ, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 6 సెం.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Details

ఎల్లో అలెర్ట్ జారీ

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ జిల్లాలన్నింటికీ 'ఎల్లో అలెర్ట్' జారీ చేసింది. అంతేకాదు బుధ, గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. సోమవారం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరు జల్లులు, వర్షాలు నమోదయ్యాయి. వర్షాల కారణంగా పంటపై ప్రభావం, ప్రయాణాల్లో అంతరాయం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.