
PM Modi: వక్ఫ్ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ తమ పాలనలో వక్ఫ్ చట్ట నియమాలను స్వార్థ ప్రయోజనాల కోసం మార్చిందని ఆరోపించారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు నెరవేర్చేందుకు పవిత్ర రాజ్యాంగాన్ని ఆయుధంలా ఉపయోగించిందని మండిపడ్డారు.
ముస్లిముల పక్షాన మాట్లాడుతున్న కాంగ్రెస్ గతంలో వారి అభ్యున్నతికి ఏ చర్యలు తీసుకురాలేదని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం నాయకులకు పార్టీలో ఉన్నత హోదాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
అంతేకాదు ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టిక్కెట్లు కేటాయించడంలో ఎందుకు వెనకడుగు వేసిందని నిలదీశారు.
హరియాణాలోని హిస్సార్ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ, ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయి అవుతుందన్నారు.
Details
కాంగ్రస్ రాజ్యాంగ విలువలను తాకట్టు పెట్టింది
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను స్మరించుకుంటూ, ఆయన సిద్ధాంతాలే తమ ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు.
కానీ కాంగ్రెస్ మాత్రం అదే రాజ్యాంగాన్ని అధికార సాధనంగా ఉపయోగించిందని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితిని ఉదాహరణగా పేర్కొంటూ, అప్పట్లో రాజ్యాంగ విలువలను పాక్షికంగా తాకట్టు పెట్టారని ఆరోపించారు.
ప్రతిపక్ష నాయకులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతున్నప్పటికీ, వాటిని అనుసరించడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం 2025 అమల్లోకి వచ్చింది.
Details
ఏప్రిల్ 16న విచారణ
అయితే ముస్లిం సంఘాలు దీన్ని రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం 14వ, 25వ, 26వ రాజ్యాంగ ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, విపక్ష పార్టీల ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మొత్తం 15 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఈ కేసులపై ఏప్రిల్ 16న విచారణ జరపనుంది. ఇక పలు రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన నిరసనల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో 110 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో వక్ఫ్ సవరణ చట్టం చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగింది.