Loading...
Mallikarjun Kharge: 'మోదీ తండ్రి కూడా పోతారు'.. ఖర్గే వ్యాఖ్యపై రాజకీయ దుమారం
'మోదీ తండ్రి కూడా పోతారు'.. ఖర్గే వ్యాఖ్యపై రాజకీయ దుమారం

Mallikarjun Kharge: 'మోదీ తండ్రి కూడా పోతారు'.. ఖర్గే వ్యాఖ్యపై రాజకీయ దుమారం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై భాజపాతోపాటు ఎన్డీయే కూటమిలోని పలు పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేపట్టనున్నట్లు భాజపా ప్రకటించింది. బిహార్‌ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్‌ 139వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన వారందరినీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక జైలుకు పంపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

కాంగ్రెస్‌, భాజపా మధ్య రాజకీయ విమర్శలు 

ఈ సమయంలో సభలో ఉన్న ఓ వ్యక్తి స్పందిస్తూ..''తిరుగుబాటు లేనంతవరకు ప్రధాని మోదీ ఎక్కడికీ వెళ్లరు'' అని గట్టిగా అరిచారు. దీనికి ఖర్గే బదులిస్తూ.. ''మోదీ తండ్రి కూడా పోతారు'' అని వ్యాఖ్యానించారు.

ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలపై భాజపాతోపాటు ఎన్డీయేలోని జేడీ(యూ), లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌), హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం కాంగ్రెస్‌, భాజపా మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.

వివరాలు 

మాఫియా ముఠాలా కాంగ్రెస్‌ కనిపిస్తోంది: నబీన్

ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్‌ సైద్ధాంతిక దివాలాకోరుతనాన్ని బయటపెడుతున్నాయని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు.

దివంగత కుటుంబ సభ్యులను రాజకీయ ప్రసంగాల్లోకి లాగడం రాహుల్‌ గాంధీతోపాటు ప్రతిపక్ష నేతల సంస్కృతిగా మారిందని ఆరోపించారు.

గతంలో గూండాలు మాట్లాడే భాషను ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ రాజకీయ పార్టీలా కాకుండా మాఫియా ముఠాలా వ్యవహరిస్తోందని నబీన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌' వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇదే తొలిసారి కాదు: అమిత్‌ షా

ప్రధాని మోదీ తండ్రిని ప్రస్తావిస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మర్యాదకు సంబంధించిన అన్ని ప్రమాణాలను ఉల్లంఘించాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు.

మోదీతోపాటు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్‌ నేతలు అసభ్యకరమైన భాష ఉపయోగించడం ఇదే తొలిసారి కాదని పేర్కొన్నారు.

గతంలో ప్రధాని తల్లిని అవమానించేలా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడారని, మోదీ పేదరికాన్ని ఎగతాళి చేస్తూ 'చాయ్‌వాలా' అని పిలిచారని షా ఆరోపించారు.

రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ నేతలు ప్రతిరోజూ అసభ్యకర వ్యాఖ్యల హద్దులు దాటుతున్నారని ఆయన 'ఎక్స్‌'లో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

సర్‌కు వ్యతిరేకంగా రెండో స్వాతంత్య్ర సమరం: ఖర్గే

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఖర్గే 'రెండో స్వాతంత్య్ర సమరం'గా అభివర్ణించారు.

సర్‌ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో దేశంలో నిర్వహించే ఎన్నికలన్నింటినీ బ్యాలెట్‌ పత్రాల ద్వారానే జరపాలని కోరారు.

ఆరెస్సెస్‌ భావజాలం అంతం కానంతవరకు దేశంలో శాంతి నెలకొనదని వ్యాఖ్యానించారు.

శ్రీకృష్ణ సింగ్‌ జయంతి కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. గత రెండేళ్లలో దేశంలో నిర్వహించిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా సోమవారం ఆందోళనలు నిర్వహించనున్నట్లు భాజపా వెల్లడించింది.

ADVERTISEMENT