జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే
జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని హిరోషిమాకు శుక్రవారం బయలుదేరారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు మోదీ వెళ్తున్నారు. ఈ ఏడాది జీ7సమ్మిట్ జపాన్ అధ్యక్షతన హిరోషిమాలో జరుగుతోంది. మే 19నుంచి మే 21వరకు జీ7శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ హిరోషిమాలో ఉంటారు. ఆహారం, ఎరువులు, ఇంధన భద్రతతో సహా ప్రపంచ సవాళ్లపై మోదీ ప్రసంగించనున్నారు. జీ7 సమావేశంలో ప్రధానంగా అణు నిరాయుధీకరణ, ఆర్థిక స్థితిస్థాపకత, ఆర్థిక భద్రత, ప్రాంతీయ సమస్యలు, వాతావరణ మార్పు, ఇంధన భద్రత, ఆహారం, ఆరోగ్య భద్రతపై చర్చించనున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు జీ7కూటమిలో ఉన్నాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్, యీయూ కూటమిలో భాగస్వాములు.
జీ7 సదస్సు ఎజెండాలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశం
జీ7 సదస్సులో భారత్ మే 20, మే 21తేదీలలో రెండు అధికారిక సెషన్లలో పాల్గొనే అవకాశం ఉంది. మొదటి సెషన్‌లో ఆహారం, అభివృద్ధి, ఆరోగ్యం, లింగ సమానత్వంపై దృష్టి పెడుతుంది. రెండో సెషన్ వాతావరణం, శక్తి, పర్యావరణం, 'శాంతియుత, స్థిరమైన మరియు సంపన్న ప్రపంచం' అనే అంశంపై భారత్ మాట్లాడనుంది. జీ7 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా, యూకే విడివిడిగా ఆంక్షలు విధించాలని యోచిస్తున్నాయి. జీ7 సదస్సు ఎజెండాలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశం ఉంటుందని సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఆంక్షల ద్వారా రష్యా ఆర్థిక శక్తిని దెబ్బతీయాలని, మాస్కోకు ఇతర దేశాల మద్దతును నిరోధించాలని అమెరికా భావిస్తోంది.