లక్షద్వీప్ ఎంపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ; కేరళ హైకోర్టుకు కీలక ఆదేశాలు
2009లో జరిగిన హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు విధించిన శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ కేసును మళ్లీ విచారించాలని ఆరు వారాల్లో తీర్పును వెలువరించాలని కేరళ హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో ఫైజల్‌కు విధించిన శిక్షను రద్దు చేయడంలో హైకోర్టు అనుసరించిన విధానం తప్పుగా ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఎంపీ ఫైజల్‌పై లోక్‌సభలో అనర్హత వేటు పడకుండా కాపాడింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆరు వారాల పాటు అమలులో ఉంటుందని బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫైజల్‌పై ఆరు వారాల పాటు అనర్హత వేటు ఉండదు.
కేసు నేపథ్యం ఇదీ..
దివంగత కేంద్ర మంత్రి పీఎం సయీద్ అల్లుడు మహ్మద్ సలీహ్‌ను చంపడానికి ప్రయత్నించినట్లు లక్షదీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో జనవరి 11, 2023న లక్షద్వీప్‌లోని కవరత్తిలోని సెషన్స్ కోర్టు ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి 10సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. జనవరి 25న సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమలో విచారించిన కేరళ హైకోర్టు ఫైజల్‌కు సెషన్స్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించింది. ఫైజల్‌కు శిక్ష విధిస్తే, మళ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఫలితంగా ప్రభుత్వంపై భారం పడుతుందన్న ఉద్దేశంతో శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తునట్లు హైకోర్టు తెలిపింది.