Telangana Thalli Statue: లక్షలాది మహిళల సమక్షంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరుగనుంది. లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించామని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనా సిద్ధం చేసి, దానికి అనుగుణంగా విగ్రహాన్ని రూపొందించారు.
అంబర్ పేట వద్ద విగ్రహం తయారీ
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ కొత్త విగ్రహంలో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీర, మెడలో కంటె, బంగారు గొలుసు, ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు ఉండగా, కుడి చేయి అభయహస్తంగా కనిపిస్తుంది. పిడికిళ్లు తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపుదిద్దాయి. విగ్రహ రూపకల్పనలో సంప్రదాయ, ఆధునికతల సమ్మిళితంతో రాచరిక ఆనవాళ్లను పూర్తిగా తొలగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాట చరిత్రను ప్రతిబింబించనుంది. మొదట ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని అనుకున్నా, ఆమె కొన్ని కారణాల వల్ల హాజరు కాలేదు.