Page Loader
Monkeypox: భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు 
భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు

Monkeypox: భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2024
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాణాంతక మంకీపాక్స్‌ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ వ్యాధి కేసు నమోదైంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుండి వచ్చిన ఒక యువకుడిలో ఎంపాక్స్‌ లక్షణాలు గుర్తించబడ్డాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వెంటనే అతడిని ఐసోలేషన్‌లో ఉంచామని,అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని పేర్కొంది. రోగి నుంచి నమూనా సేకరించి ఎంపాక్స్‌ నిర్ధారణ కోసం పంపించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని,అలాగే వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కొనసాగిస్తున్నట్లు వివరించింది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఈ వ్యాధి తీవ్రతపై ముందస్తు అంచనాలు వేసిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

వివరాలు 

 18,000 అనుమానిత కేసులు, 926 మరణాలు 

ఇలాంటి కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. మరోవైపు, ప్రాణాంతక ఎంపాక్స్‌ వ్యాప్తి ఆఫ్రికా దేశాలలో ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే 18,000 అనుమానిత కేసులు, 926 మరణాలు సంభవించాయి. కొత్తరకం కేసులు ఇప్పటివరకు 258 నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికాలో బురుండి, రువాండా, కెన్యా, ఉగాండా దేశాలలో, అలాగే స్వీడన్‌, థాయిలాండ్‌ దేశాలలోనూ ఈ కేసులు వెలుగు చూశాయి. భారత్‌లో, ఈ ఏడాది మార్చి తర్వాత ఎలాంటి కేసులు నమోదు కాలేదు.