Mukesh Ambani : ముకేశ్ అంబానీకి తెలంగాణ,గుజరాతీ యువకుల బ్లాక్ మెయిల్స్.. ఎందుకో తెలుసా
రిలయెన్స్ గ్రూప్ అధిపతి, ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి వరుస బెదిరింపు మెయిల్స్ రావడం వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తి అంబానీని చంపేస్తామంటూ అదే పనిగా అంబానీ సెక్యూరిటీకి మెయిల్స్ పంపించాడు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తప్పకుండా చంపేస్తామని బెదిరింపు లేఖలు సంధించాడు. ఇప్పటికే ఆరు సార్లు ఇటువంటి బ్లాక్ మెయిల్స్ వచ్చాయని సమాచారం. దీన్ని తీవ్రంగా తీసుకున్న ముంబై సిటీ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఆపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన 19 ఏళ్ల ఓ యువకుడు సహా గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల యువకుడిని కటకటాల వెనక్కి పంపారు.
సరదా కోసమే నిందితులు ఈపని చేశారంట : పోలీసులు
అయితే విచారణ భాగంగా పోలీసులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.సరదా కోసమే నిందితులు ఈపని చేశారన్నారు. మరోవైపు ఈ ఇద్దరు నిందితుల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు.ముకేశ్ అంబానీకి వారం రోజుల వ్యవధిలోనే ఇలా 6 సార్లు బెదిరింపు మెయిల్స్ వచ్చాయన్నారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన గణేశ్ రమేశ్ నవంబర్ 1న అంబానీ సెక్యూరిటీకి మెయిల్ పంపాడు. రూ.500 కోట్లు ఇవ్వకపోతే అంబానీని చంపేస్తామన్నాడు. వరంగల్‌లోని ఎస్సాఆర్ వర్శిటీ నుంచి ఈ మెయిల్స్ పంపారని, IP అడ్రెస్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని మొబైల్‌ని చెక్ చేశారు. వెంటనే ఆ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రాజ్‌వీర్ కాంత్‌గా ముంబై పోలీసులు తేల్చారు.