Longest Sea Bridge: 'అటల్ సేతు'ను ప్రారంభించిన మోదీ..
దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఎంటీహెచ్‌ఎల్‌కు 'అటల్ సేతు'(Atal Setu)గా నామకరణం చేశారు. దక్షిణ ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ప్రస్తుతం రెండు గంటల సమయం పడుతుండగా, కొత్తగా నిర్మించిన వంతెనతో 15- 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. 17,840 కోట్లకు పైగా వ్యయంతో 21.8 కిలోమీటర్ల పొడవైన వంతెనను నిర్మించారు. ఈ వంతెనకు 2016 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఏడేళ్లలో దీని నిర్మాణం పూర్తయింది. భూకంపాలను సైతం తట్టుకొనేలా దీని నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించారు.
మోదీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి
అంతకముందు,ప్రధాని నాసిక్‌లో మెగా రోడ్‌షోలో పాల్గొన్నారు. శ్రీ కాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. మోదీ వెంట మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉన్నారు.