Page Loader
Mumbai Train Blasts: ముంబయి రైలు పేలుళ్లలో ఆ 12 మంది నిర్దోషులే: బాంబే హైకోర్టు
ముంబయి రైలు పేలుళ్లలో ఆ 12 మంది నిర్దోషులే: బాంబే హైకోర్టు

Mumbai Train Blasts: ముంబయి రైలు పేలుళ్లలో ఆ 12 మంది నిర్దోషులే: బాంబే హైకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

రెండు దశాబ్దాల క్రితం ముంబై పట్టణాన్ని కుదిపేసిన రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. 2006లో జరిగిన ఈ పేలుళ్ల కేసులో ఇప్పటికే శిక్ష విధించబడిన 12 మందిని తాజాగా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో నిందితులపై ఉన్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రభుత్వ వాదనలు (ప్రాసిక్యూషన్‌) విఫలమైన నేపథ్యంలో వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ 12 మందిలో మరణశిక్ష విధించబడిన ఖైదీలు కూడా ఉన్నారు. ఆ దారుణ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 2006 జూలై 11న ముంబయిలో పశ్చిమ రైల్వే లైన్‌లోని పలు సబర్బన్‌ రైళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి.

వివరాలు 

2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు 12 మందిని నిందితులుగా తేల్చింది

ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ మారణహోమంలో 189 మంది అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కొనసాగిన సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 2015 అక్టోబరులో ప్రత్యేక కోర్టు 12 మందిని నిందితులుగా తేల్చింది. అందులో ఐదుగురికి బాంబులు అమర్చిన అభియోగంపై ఉరిశిక్షను విధించగా, మిగిలిన ఏడుగురికి జీవితఖైదు శిక్షను విధించింది. అయితే, దోషుల్లో కమల్‌ అన్సారీ అనే ఖైదీ 2021లో నాగ్‌పూర్‌ జైలులో కోవిడ్‌ వ్యాధి కారణంగా మృతి చెందాడు. ఈ ప్రత్యేక కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్పును సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది.

వివరాలు 

2024 జూలైలో హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు 

2015 నుంచి ఈ కేసు బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ వ్యవహారంపై అనేక అభ్యర్థనల తర్వాత, 2024 జూలైలో హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసి రోజువారీ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం సోమవారం హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 12 మందినీ నిర్దోషులుగా ప్రకటించింది. ట్రయల్‌ కోర్టు తీర్పులో అనేక లోపాలు ఉన్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులపై అభియోగాలను న్యాయపూర్వకంగా రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని స్పష్టం చేసింది.