ManiShankar Iyer: గాంధీ కుటుంబం వల్లే నా రాజకీయ పతనం.. కాంగ్రెస్‌పై మణిశంకర్ ఆరోపణలు!
కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తనకు ఎదుగుదలలో గాంధీ కుటుంబం ఎంత ముఖ్యమో, తన రాజకీయ పతనానికి కూడా వారు అంతే కారణమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌లో చిన్న స్థాయి నేతలకు సరైన గుర్తింపు ఉండదని ఆయన చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించినప్పటికీ, తనను అగ్రనాయకత్వం సస్పెండ్ చేయడం బాధించిందని అయ్యర్ తెలిపారు. అగ్రనేత సోనియా గాంధీని కలుసుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినా, అవకాశం ఇవ్వలేదని ఆయన తెలిపారు.
ప్రణబ్ ముఖర్జీ ఒంటి చేత్తో పార్టీని నడిపారు
రాహుల్ గాంధీతో ఒకసారి, ప్రియాంక గాంధీతో రెండు సార్లు మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. ప్రియాంకది దయా హృదయమని, ఆమె అప్పుడప్పుడు ఫోన్ చేసి తన బాగోగులు తెలుసుకుంటారని ఆయన తెలిపారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తలెత్తిన సంక్షోభాలను ఆయన ప్రస్తావించారు. సోనియా గాంధీ అనారోగ్యం, మన్మోహన్ సింగ్‌కు బైపాస్ సర్జరీ వంటి సమస్యల వల్ల పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఒంటి చేత్తో పార్టీని నడిపారని, ఆయన అందించిన నాయకత్వం తమకెంతో సాయపడిందని అయ్యర్ గుర్తుచేశారు.
కాంగ్రెస్ లో కృషి చేసిన వారికి సరైన గుర్తింపు లేదు
ఇటీవల రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్‌పర్సన్ నజ్మా హెప్తుల్లా కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత సోనియా గాంధీకి ఫోన్ చేస్తే గంటల పాటు లైన్‌లో ఉంచారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌లో కృషి చేసిన వారికి సరైన గుర్తింపు లేదని, అందుకే అనేకమంది నేతలు కాంగ్రెస్‌ను విడిచి వెళ్లారని ఆమె తెలిపారు. మణిశంకర్ అయ్యర్ ఆరోపణలతో పాటు నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ ఆగడాలను వెలుగులోకి తెచ్చాయి.