Nagarjuna Sagar : సాగర్ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్ర సరిహద్దు వైపు పోలీసులు భారీగా మోహరించారు. ఈ మేరకు ఏపీకి చెందిన దాదాపు 1200 మంది పోలీసులు కాపు కాస్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు సైతం ప్రాజెక్టు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరోవైపు కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం డ్యామ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం సమీక్షించ నిర్వహించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు, ఘటన స్థలంలో పరిస్థితిని అంచనా వేయనున్నారు.
మరో 12 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీ
గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్ వద్దే మకాం వేశారు.ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించింది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉంది. మరో 12అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీకి చేరే ప్రమాదముంది. మరోవైపు ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్'లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది,నీటి పారుదలశాఖ అధికారులు స్థానిక పీఎస్'లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ పోలీసులు, ఏపీ నీటి పారుదల శాఖ అధికారులపై నాగార్జునసాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ, ఏపీలకు వివాదం ఎందుకు
రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పడ్డాయి.శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలన్న నిర్ణయం అమలుకు నోచుకోలేదు. ఈ మేరకు శ్రీశైలంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ నిర్వహించుకుంటోంది. ఏపీ అధికారులను అక్కడికి రానివ్వట్లేదు. ఇదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఏపీ భూభాగంలో ఉన్నాయి.కుడి కాలువ నుంచి ఏపీకి నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు.గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలిచ్చినా నీళ్లు విడుదల చేయలేదు. ప్రస్తుతం నీటి సమస్యలు లేకపోయినా, నీటి విడుదలకు గత రెండు నెలల్లో ఇబ్బందులేవీ రాకున్నా ఏపీ అధికారులు దూకుడు ప్రదర్శించారు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పట్నుంచో ఏపీ సర్కార్ డిమాండు చేస్తోంది.