Nagpur: 'టీ' ఆలస్యం అయ్యిందని.. శస్త్రచికిత్సను మధ్యలోనే వదిలేసిన వైద్యుడు
నాగపూర్ లోని ఒక వైద్యుడు టీ తీసుకురాలేదని స్టెరిలైజేషన్ సర్జరీ (వేసెక్టమీ)ని మధ్యలోనే వదిలేశాడు. దింతో అతనిపై ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు. నాగపూర్ లోని మౌడా ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది మంది మహిళలను వేసెక్టమీ కోసం పిలిపించారు. నలుగురు మహిళలకు శస్త్రచికిత్స చేసిన తర్వాత, డాక్టర్ భాలవి ఆసుపత్రి సిబ్బందిని ఒక కప్పు టీ అడిగారు. టీ ఆలస్యంగా రావడంతో అసహనం వ్యక్తం చేసిన సదరు డాక్టర్ చిర్రెతుకొచ్చి ఆపరేషన్ థియేటర్ నుండి వెళ్లిపోయారు.
కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు
ఈ సంఘటన జరిగిన సమయంలో నలుగురు మహిళలకు అనస్థీషియా ఇవ్వడంతో వారు గాఢ నిద్రలో ఉన్నారు. అనంతరం మహిళ కుటుంబసభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రికి మరో వైద్యుడిని పిలిపించినట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ ఘటనపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ మాట్లాడుతూ.. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు.