
Nara Lokesh: జీడిపప్పు,మిరప,మామిడి బోర్డులు ఏర్పాటు చేయండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీలో లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రత్యేక పంటల అభివృద్ధి కోసం కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ను అభ్యర్థించారు. శ్రీకాకుళంలో జీడిపప్పు, గుంటూరులో మిరపకాయ, చిత్తూరులో మామిడి పంటలకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోకేశ్ వివరించినట్లు, జీడిపప్పు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. ఉత్పత్తిని ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాలతో మరింత మెరుగుపరచడానికి, అలాగే సరైన మార్కెటింగ్ అవకాశాలను కల్పించడానికి జీడిపప్పు బోర్డు అత్యవసరం. అలాగే, గుంటూరులో మిరప బోర్డు స్థాపిస్తే, ధరలలో ఏర్పడే ఊహించని హెచ్చుతగ్గులను నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
మౌలిక వసతుల కోసం రూ.5,811 కోట్ల గ్రాంట్
మామిడి పంట విషయానికొస్తే,రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 50లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నదని,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు సమగ్ర పరిష్కారం చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు ద్వారానే సాధ్యమని లోకేశ్ అన్నారు. అలాగే, మూలపేట, చిలమత్తూరు, కుప్పం, దొనకొండ ప్రాంతాల్లో నాలుగు కొత్త పారిశ్రామిక నోడ్‌లను అభివృద్ధి చేసేందుకు తక్షణ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. నీరు, విద్యుత్, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల కోసం రూ.5,811 కోట్ల గ్రాంట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
చిత్తూరు నోడ్‌కి ఆమోదం ఇవ్వండి
విజయవాడ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు నోడ్‌కి ఆమోదం ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ఇదే సమయంలో, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్‌ల మాస్టర్ ప్లాన్‌లు ఇప్పటికే ఆమోదం పొంది, టెండర్లకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటి ఈపీసీ (EPC) ప్రక్రియ కొనసాగేందుకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి ఆమోదం ఇవ్వాలని లోకేశ్ గోయల్‌ను అభ్యర్థించారు.