అమెరికా కాంగ్రెస్‌లో మోదీ రెండోసారి ప్రసంగం; ఆ ఘనత సాధించిన తొలి భారత ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
జూన్ 22న జరిగే అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించేందుకు ఎదురుచూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
అమెరికా ఆహ్వానాన్ని అంగీకరించడం గౌరవంగా భావిస్తున్నానని మోదీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాలు, ఆమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో తాము గర్విస్తున్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో చెప్పారు.
జూన్ 22న తమ దేశ పర్యటన సందర్భంగా ప్రతినిధుల సభ, సెనేట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించాల్సిందిగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని యూఎస్ కాంగ్రెస్ ఆహ్వానించింది.
మోదీ
ఏడేళ్ల క్రితం తొలిసారి ప్రసంగం
ప్రధాని మోదీ ఏడేళ్ల క్రితం ఒకసారి యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. తాజాగా కూడా ఆయనకు మళ్లీ అవకాశం రావడంతో రెండోసారి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోతారు.
అమెరికా కాంగ్రెస్‌లో మూడు సార్లు అత్యధికంగా ప్రసంగించిన ప్రధానిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మొదటిస్థానంలో ఉన్నారు. మోదీ మరోసారి ప్రసంగిస్తే రెండోస్థానంలో నిలుస్తారు.
అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
అమెరికా, భారత్ మధ్య లోతైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన ఒక అవకాశంగా నిలుస్తుందని వైట్‌హౌస్ పేర్కొంది.