Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన
ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే 3,4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్'లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మే 3న పీలేరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న ఆయన.. ఆ తర్వాత విజయవాడ చేరుకుంటారు. విజయవాడ తూర్పు,విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ గుడి వరకు జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. బీజేపీ నేత సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు.
బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు
ప్రధానమంత్రి చేసే రోడ్ షో ఆయన విజయానికి ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మే 4వ తేదీన రాజమండ్రి (Rajahmundry),అనకాపల్లి (Anakapalli)లో ప్రధాని మోదీ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో మోదీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు. ఏపీలో నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ గురువారంతో పూర్తి కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారం జోరు పెంచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.