Page Loader
Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి
ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి

Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య భారతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, మేఘాలయ, సిక్కిం, మణిపూర్‌ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి విషమంగా మారింది. బ్రహ్మపుత్ర, బరాక్‌ నదులతో పాటు 15కు పైగా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. వరదలతో దాదాపు 7 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. పలు గ్రామాలు నీటమునిగాయి. వర్షాలకు ఇండ్లు ధ్వంసమవడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అసోంలోని 21 జిల్లాల్లో 6.32 లక్షలకుపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వాతావరణ కేంద్రం 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. రోడ్డు, రైలు, నౌకాశ్రయాలపై కూడా వరదల ప్రభావం తీవ్రంగా ఉంది.

Details

సిక్కింలో తరుచూ విరిగిపడుతున్న కొండచరియలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిక్కింలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయి. లాచెన్ నగరంలోని ఛతెన్ వద్ద ఆర్మీ క్యాంప్‌పై కొండచరియలు పడగా.. ఆరుగురు సైనికులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సిక్కింలో చిక్కుకున్న 1,700 మందిని ఇప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 34 మందిని రెండు Mi-17 V5 హెలికాప్టర్ల సాయంతో పాక్యోంగ్‌ విమానాశ్రయానికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్‌కి చెందిన 23 మంది సభ్యులతో కూడిన బృందం అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది. అదే సమయంలో తీస్తా నదిలో వాహనంతో కొట్టుకుపోయిన 8 మందిని గాలిస్తున్నారు. మేఘాలయలో పరిస్థితి మరింత విషమంగా ఉంది.

Details

సిక్కింలో ఐదుగురు మృతి

తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో పర్యాటకుడు రాజా రఘువంశీ (29) మృతి చెందగా, అతని భార్య సోనమ్‌ ఆచూకీ కనిపించలేదు. ఆమె కోసం 17 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్‌ బృందం గాలిస్తున్నారు. గత 10 రోజుల్లో సిక్కింలో మొత్తం 552 కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. ఇందులో ఐదుగురు మృతిచెందారు. 152 ఇండ్లకు నష్టం వాటిల్లింది. అసోంలో బాధితుల కోసం 165 సహాయ శిబిరాలు, 157 సహాయ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 31,212 మంది ఆశ్రయం పొందుతున్నారు. మణిపూర్‌లో వరదల ప్రభావంతో 1.64 లక్షల మంది ప్రజలు దెబ్బతిన్నారు. 35,143 ఇండ్లకు నష్టం జరిగింది.

Details

వరద పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష

వరదల పరిస్థితులపై అసోం, సిక్కిం ముఖ్యమంత్రులు, మణిపూర్‌ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అవసరమైనంత వరకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వరదల కారణంగా అసోంలో 17 మంది, అరుణాచల్ ప్రదేశ్‌లో 11 మంది, మేఘాలయలో 6 మంది, మిజోరాంలో 5 మంది, సిక్కింలో 3 మంది, త్రిపురాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, బిహార్‌లోని సివాల్‌ జిల్లాలో భారీ వర్షానికి ఏడుగురు మృతిచెందారు.