Kaamya Karthikeyan: ఎవరెస్ట్ అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా నేవీ అధికారి కుమార్తె..
ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ విజయవంతంగా మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది. నేపాల్ వైపు నుండి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా గుర్తింపు పొందినట్లు భారత నౌకాదళం గురువారం తెలిపింది. ఆమె నావికాదళ అధికారి కుమార్తె . ముంబైలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. నేవీ అధికార ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం,మే 20న కామ్య,ఆమె తండ్రి కమాండర్ ఎస్ కార్తికేయన్ ఎవరెస్ట్ శిఖరాన్ని(8,849 మీటర్లు)విజయవంతంగా అధిరోహించారు. ఈ విజయంతో, ఆమె ప్రపంచంలోనే రెండవ అతి పిన్న వయస్కురాలు,నేపాల్ నుండి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ పర్వతారోహకురాలిగా రికార్డు సృష్టించింది.
'7 సమ్మిట్స్ ఛాలెంజ్' టార్గెట్
దీంతో మొత్తం ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే లక్ష్యంతో కామ్య ఆరు మైలురాళ్లను పూర్తి చేసినట్లు నేవీ తెలిపింది. ఆమె ఇప్పుడు ఈ డిసెంబర్‌లో అంటార్కిటికాలోని విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించి '7 సమ్మిట్స్ ఛాలెంజ్' పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.