NDA: నేడు ఎన్డీయే భేటీ.. ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం...
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో బుధవారం దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీల అగ్రనేతలు, పలువురు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరుకానున్నారు. భాజపా అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.
వివరాలు
తీర్మానం ప్రవేశపెట్టనున్న చంద్రబాబు
ఈ సమావేశానికి ఎన్డీయే కూటమిలోని 35 పార్టీలకు చెందిన దాదాపు 75 మంది ప్రముఖ నాయకులు హాజరవుతారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ, ఎన్డీయే కూటమికి అందిస్తున్న మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనుండగా, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో బలపరచనున్నారు. అనంతరం పలువురు కూటమి నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనుండగా, తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ప్రధాని మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సమావేశంలో దేశ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
వివరాలు
శుభాకాంక్షల వెల్లువ
ప్రజలకు సులభతర జీవనం,వ్యాపారాలకు మరింత అనుకూల వాతావరణం కల్పించే చర్యలు,2047 నాటికి'వికసిత్ భారత్'లక్ష్య సాధన కోసం చేపట్టాల్సిన తదుపరి సంస్కరణలు,జాతీయాభివృద్ధి కార్యక్రమాలు,మౌలిక వసతుల విస్తరణ ప్రణాళికలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసే మార్గాలపై కూడా నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. ఇదిలా ఉండగా,ప్రధానిగా సుదీర్ఘ కాలం సేవలందిస్తున్న నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రత్యేక లేఖ రాసి శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినీ ప్రధాని జేమ్స్ మరాపే,ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిస్సెసార్‌తో పాటు పలువురు విదేశీ నేతలు మోదీకి అభినందనలు తెలియజేశారు.