
Rajasthan: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నీట్ అభ్యర్థి కోటాలో ఆత్మహత్య.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి.
తాజాగా, జమ్ముకశ్మీర్‌కి చెందిన జీషన్ అనే విద్యార్థిని, నీట్ (NEET) వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ, తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది.
జీషన్ కోటాలోని ప్రతాప్ చౌరహా ప్రాంతంలోని ఒక హాస్టల్‌లో పేయింగ్ గెస్ట్‌గా నివాసం ఉంటూ నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం, తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.
ఆత్మహత్యకు ముందు, ఆమె తన బంధువులతో ఫోన్‌లో మాట్లాడిందనీ, తాను బతకలేనని చెప్పిందనీ పోలీసులు తెలిపారు.
వివరాలు
ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి
ఈ సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే అదే భవనంలో ఉన్న మమత అనే మరో విద్యార్థిని, జీషన్ గదికి వెళ్లింది.
అయితే, అప్పటికే గదికి తాళం వేసి ఉండటంతో ఆమె అరిచిందని, శబ్దాలు విన్న హాస్టల్‌లోని ఇతరులు వచ్చి తలుపులు బద్దల కొట్టారని పోలీసులు వివరించారు.
గదిలోకి ప్రవేశించగానే జీషన్ సీలింగ్‌కి వేలాడుతున్న దృశ్యం కన్పించిందని తెలిపారు.
ఆమెను అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోటాలో 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో ఇదే నెలలో జరిగిన రెండో మరణం ఇది.
వివరాలు
కోటాలోనే ఎందుకు..
విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు కోటాలోనే ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రశ్నపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పందించింది.
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం మే 23 నాటికి కోటాలో 14 మంది విద్యార్థులు బలవన్మరణాలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
''ఒక రాష్ట్రంగా మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు పిల్లలు కోటాలోనే జీవితాలను విడిచిపెడుతున్నారు? ఈ సమస్యపై ప్రభుత్వం ఆలోచించలేదా?'' అంటూ న్యాయమూర్తి జస్టిస్ పార్థీవాలా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్య కేసు, కోటాలో ఇటీవల నీట్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.