Page Loader
NEET: రెండంచెల్లో నీట్‌!.. రాధాకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు
రెండంచెల్లో నీట్‌!.. రాధాకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు

NEET: రెండంచెల్లో నీట్‌!.. రాధాకృష్ణన్‌ కమిటీ కీలక సిఫారసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

జేఈఈ తరహాలో NEET ను రెండంచెల్లో నిర్వహించాలని రాధాకృష్ణన్‌ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. గత NEET పరీక్షలో కొంత మందికి ఆలస్యంగా ప్రశ్నపత్రాలు అందించడంతో, వారికి మార్కులు కేటాయించడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఆధ్వర్యంలో సమర్థంగా పరీక్షల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం గత జులైలో ఇస్రో మాజీ ఛైర్మన్‌ రాధాకృష్ణన్‌ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తాజాగా కేంద్ర విద్యాశాఖకు ముసాయిదా నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

మొదటి పరీక్ష ఆన్‌లైన్‌లో,తుది పరీక్ష ఆఫ్‌లైన్ లో..

ఈ నివేదికలో NEET,కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) నిర్వహణలో అవసరమైన మార్పులను సూచించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం NITలు, IITల్లో సీట్ల భర్తీకి మొదట జేఈఈ మెయిన్ నిర్వహించబడుతోంది. అందులో కనీస మార్కులు సాధించిన విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అనుమతిస్తారు. NEET‌కు దేశవ్యాప్తంగా 18 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నందువల్ల, మొదట వడపోత పరీక్ష నిర్వహించాలని, తదుపరి పరీక్ష నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. దీని వల్ల తుది పరీక్షకు విద్యార్థుల సంఖ్య,పరీక్షా కేంద్రాల సంఖ్య తగ్గి.. పర్యవేక్షణ పెరిగి నిర్వహణ సులభంగా ఉంటుంది. మొదటి పరీక్ష ఆన్‌లైన్‌లో,తుది పరీక్ష ఆఫ్‌లైన్(పెన్ను,పేపర్) విధానంలో నిర్వహించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలను కలిపి నిర్వహించవచ్చు.

వివరాలు 

ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు పంపడం సురక్షితం

ఆఫ్‌లైన్ పరీక్ష నిర్వహణలో ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. లీకేజీకి అవకాశం ఉన్నందున, పరీక్ష ప్రారంభానికి అరగంట లేదా గంట ముందు డిజిటల్ రూపంలో ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు పంపడం సురక్షితంగా ఉంటుంది. వాటిని ప్రింట్ తీసి, అప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులకు ఇవ్వాలి. ఇక, దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ సీట్ల భర్తీకి నిర్వహించే CUETలో 50 సబ్జెక్టులు ఉన్నాయి, వాటిని తగ్గించాల్సి ఉందని కమిటీ పేర్కొంది. NTAలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు.పరీక్షల నిర్వహణ, డేటా భద్రత కోసం నిపుణులైన శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. తుది నివేదికను కొద్దిరోజుల్లో సమర్పించనున్నారు, కొన్ని సిఫారసులు వచ్చే NEETలోనే అమలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.