Page Loader
Medtech: విశాఖకు మరో మణిహారం.. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ కి శ్రీకారం
విశాఖకు మరో మణిహారం.. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ కి శ్రీకారం

Medtech: విశాఖకు మరో మణిహారం.. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ కి శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకున్న విశాఖపట్టణంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ (మెడ్‌టెక్‌ జోన్‌) మరో ముందడుగుగా కొత్త ఒరవడికి పునాది వేస్తోంది. మెడికల్‌ టెక్నాలజీలో ఉన్నత స్థాయి పరిశోధన, శిక్షణ కోసం ఒక అంతర్జాతీయ స్థాయి మెడ్‌టెక్‌ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తయితే, దేశంలోనే మొట్టమొదటి మెడ్‌టెక్‌ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందనుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లో, పారిశ్రామికవేత్తల సహకారంతో నిర్వహించబడుతుందని సమాచారం.

వివరాలు 

ఆకృతిని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 

2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌ ద్వారా ఏర్పడిన ఈ మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ జితేంద్రశర్మ నాయకత్వంలో అత్యుత్తమ ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదిగింది. దేశంలో వైద్య పరికరాలపై ఆధారపడటం తగ్గించేందుకు, పరిశోధన, విద్యా వనరుల కొరతను పూరించేందుకు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించారు. జులైలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఎంటీజడ్‌ సందర్శన సందర్భంగా ఈ విశ్వవిద్యాలయ ఆకృతిని ఆవిష్కరించారు. ఇక్కడి ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లతో కలిసి మరిన్ని ప్రాజెక్టులను అభివృద్ధి చేయవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అందిస్తాయని అప్పట్లో చంద్రబాబు పేర్కొన్నారు.

వివరాలు 

విశ్వవిద్యాలయం ప్రత్యేకతలు 

2025-26 విద్యా సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయం కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందులో మెడికల్‌ టెక్నాలజీ, రెగ్యులేటరీ వ్యవహారాల (నియంత్రణ వ్యవహారాలు)లో ఎంబీఏ, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మొదటిగా 250 మంది విద్యార్థులతో ఈ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుతం 140కి పైగా పరిశ్రమలు మెడ్‌టెక్‌ జోన్‌లో ఉన్నాయి,అక్కడ విద్యార్థులు శిక్షణ పొందే అవకాశం ఉంది. పారిశ్రామిక నిపుణులు సలహాలిచ్చి, విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణనిచ్చే విధానం రూపొందించారు. ప్రవేశాల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.