AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్.. కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాదించిన రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితమే ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాలతో కార్యరూపం దాల్చలేదు.
ఈ నేపథ్యంలో ఒకసారి రద్దయిన ఈ ప్రాజెక్టును ఇటీవల నేషనల్ హైవేస్ ఒరిజినల్ (ఎన్‌హెచ్-ఓ) జాబితాలో చేర్చడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.
800 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1,062 కోట్ల వ్యయాన్ని అంచనా వేస్తున్నారు.
Details
90 కిలోమీటర్లు తగ్గే అవకాశం
ఈ బ్రిడ్జి పూర్తయితే, కృష్ణా నది ఈవతల తెలంగాణలోని మల్లేశ్వరం, అవతల ఆంధ్రప్రదేశ్‌లోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తుంది.
తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరో ప్రత్యామ్నాయ రహదారి ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే దూరం దాదాపు 90 కిలోమీటర్లు తగ్గనుంది.
ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించాలంటే కర్నూలు మీదుగా నంద్యాల చేరుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే కొత్త బ్రిడ్జి కొల్లాపూర్ మీదుగా కృష్ణా నది దాటేలా అనుసంధానం చేయడంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
Details
దేశంలోనే ప్రత్యేకమైన డిజైన్
సోమశిల వద్ద ప్రతిపాదిత ఈ రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలోనే తన తరహాలో మొదటిదిగా నిలవనుంది.
దేశంలో రెండు వరుసల వంతెనలు చాలా అరుదుగా ఉంటాయి. అంతేకాదు ఈ బ్రిడ్జి కేబుల్ కమ్ సస్పెన్షన్ పద్ధతిలో నిర్మితమవుతుండటం మరో విశేషం.
ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకంగా నిలిచే అంశం - ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాజుతో కూడిన నడకదారిని డిజైన్‌లో భాగం చేయడం.
ఇప్పటివరకు భారత్‌లో ఇలాంటి గాజు డెక్ అనుసంధానంతో కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి ఎక్కడా లేదు.
Details
వాహన రాకపోకలతోపాటు పర్యాటక ఆకర్షణ
ఈ బ్రిడ్జి పైభాగంలో నాలుగు వరుసల రోడ్డు నిర్మించనున్నారు. దీని మీదుగా వాహనాలు సులభంగా రాకపోకలు నిర్వహించుకోగలవు.
అదేవిధంగా దిగువ భాగంలో మరో వరుస ఏర్పాటు చేయనున్నార. అక్కడ పర్యాటకులు నడచేందుకు గాజు ప్యానెల్స్‌తో కూడిన డెక్ అందుబాటులో ఉంటుంది.
ఈ డిజైన్ వల్ల పర్యాటకులు కృష్ణా నదిపై ఉంచిన ఈ వంతెన నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
ఈ ప్రాజెక్టు పూర్తయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, పర్యాటక రంగంలోనూ కొత్త ప్రేరణ ఇవ్వనుంది.