
Nadendla Manohar: రాష్ట్రానికి నూతన గుర్తింపు.. ఈ-కేవైసీ నమోదులో ఏపీ దేశంలోనే అగ్రస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
రేషన్ కార్డు వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందడుగు వేసింది. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తెనాలిలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం ఈ-కేవైసీ పూర్తి అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,46,21,223 బియ్యం కార్డులు ఉండగా, వాటికి సంబంధించిన సభ్యుల సంఖ్య 4,24,59,028 అని చెప్పారు.
ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులు, కొత్త దరఖాస్తులు వంటి ఆరు రకాల సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.
ఇకపై ఇంటి నుంచే ఈ సేవలు పొందేలా వాట్సాప్ గవర్నెన్స్ సౌకర్యాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.
Details
జూన్ నుంచి ఆధునిక స్మార్ట్ కార్డుల జారీ
95523 00009 అనే నంబర్‌కు 'హలో' అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు వివరించారు.
ఇక రేషన్ కార్డుల స్థానంలో జూన్ నుంచి ఆధునిక స్మార్ట్ కార్డుల జారీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందులో భాగంగా తొలిసారిగా ఒంటరిగా నివసించే వారికి కూడా కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
కళాకారులకు అందుతున్న పింఛన్లకు తోడు, గిరిజన బృందాలకు ప్రత్యేకంగా అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 35 కిలోల బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు.
లింగ మార్పు చేయించుకున్న వారికీ ఈ సౌకర్యం వర్తించనుందని మంత్రి స్పష్టం చేశారు.