
MA Baby: వామపక్ష పార్టీకి నూతన సారధి.. సీపీఎం చీఫ్‌గా ఎం.ఎ.బేబీ ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
వామపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ.బేబీ (M.A. Baby)ని ఎంపిక చేశారు.
తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది సీతారాం ఏచూరి మరణంతో ఖాళీగా ఉన్న ప్రధాన కార్యదర్శి పదవిని ఆయన భర్తించనున్నారు.
ఈ పదవికి తాత్కాలికంగా ప్రకాశ్ కారాట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ఈ మహాసభలో పార్టీకి కొత్త సారథి లభించాడు.
Details
85 మంది సభ్యులతో కేంద్ర కమిటీ
మదురై మహాసభలో 85 మందితో కూడిన కొత్త కేంద్ర కమిటీని పార్టీ ఎన్నుకుంది. అలాగే 18 మంది సభ్యులతో కొత్త పొలిట్‌బ్యూరోను కూడా ప్రకటించింది.
ముఖ్యమైన అంశం ఏమిటంటే కేంద్ర కమిటీలో మహిళల శాతం 20శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ప్రధాన కార్యదర్శి పదవికి అనేక ప్రముఖ నేతల పేర్లు పరిగణనలోకి వచ్చాయి.
వీరిలో ఎం.ఎ.బేబీతో పాటు అశోక్ ధవలే, మహమ్మద్ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్ పేర్లు ముందుగా వినిపించాయి.
అయితే అశోక్ ధవలేకు ఆలిండియా కిసాన్ సభ (AIKS) వర్గం నుంచి మద్దతు లభించినట్టు సమాచారం.
Details
ఎం.ఎ.బేబీ రాజకీయ ప్రస్థానం ఇదే
1954లో కేరళలోని ప్రాక్కుళం ప్రాంతంలో పి.ఎం. అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు ఎం.ఎ.బేబీ జన్మించారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ప్రస్తుతం ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరి తన సాహసయాత్ర ప్రారంభించారు.
1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. అనంతరం కేరళలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఇప్పుడు తాజాగా పార్టీ శ్రేణులు ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడంతో, ఎం.ఎ.బేబీకి దేశవ్యాప్తంగా వామపక్ష శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.