SVAMITVA scheme: స్వమిత్వ పథకం పనులకు నూతన ఊపు.. మళ్లీ ప్రారంభమైన సర్వేలు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామ కంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే 'స్వమిత్వ పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది.
మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి సర్వే పూర్తిచేసి, యాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు కేటాయించకపోవడంతో, ఐదేళ్ల కాలంలో కేవలం 5 లక్షల ఆస్తులకు మాత్రమే యాజమాన్య హక్కులను నిర్ధారించారు.
అందులోనూ మొత్తం 3 లక్షల ధ్రువపత్రాలే పంపిణీ చేశారు. ఎన్నికలకు ఏడాది ముందుగా ఈ పథకం నిలిచిపోగా, తాజాగా కూటమి ప్రభుత్వం మిగిలిన గ్రామాల్లో సర్వేను వేగవంతం చేసి, వచ్చే మూడేళ్లలో ప్రజలకు పూర్తి యాజమాన్య హక్కులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
Details
సీఎం ఫొటోకు బదులుగా ప్రభుత్వ లోగో
ప్రస్తుతం గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసే హక్కు ప్రజలకు లేదు.
అయితే స్వమిత్వ పథకంలో ఇచ్చే యాజమాన్య హక్కు పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేయనుంది.
వైసీపీ హయాంలో 17,554 రెవెన్యూ గ్రామాల్లో కోటికి పైగా ఆస్తులు ఉండగా, కేవలం 1,410 గ్రామాల్లోనే సర్వే పూర్తయింది.
మొత్తం 5 లక్షల ఆస్తులకే డ్రోన్ సర్వే నిర్వహించగా, ముద్రించిన 3 లక్షల ధ్రువపత్రాలపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉండటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా వాటిని ప్రజలకు పంపిణీ చేసింది.
Details
పంచాయతీల ఆస్తులపై స్పష్టత
స్వమిత్వ సర్వే ద్వారా పంచాయతీలకు సంబంధించిన ఆస్తుల పట్ల స్పష్టత లభించనుంది.
గ్రామాల్లో భవనాలు, చెరువులు, రోడ్లు, కాలువలు, ఖాళీ స్థలాలన్నింటినీ గుర్తించి, వాటిపై హక్కులను నిర్ధారించనున్నారు.
5 వేల పంచాయతీల్లో భూములు, చెరువులు అక్రమంగా ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొన్ని భవనాలను స్థానిక పెద్దలు స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
అలాగే పలు పంచాయతీ ఆస్తులకు సంబంధించిన అద్దెలు, లీజులు అక్రమంగా వినియోగిస్తున్న పరిస్థితిని సర్వే ద్వారా గుర్తించి వాటిని తిరిగి పంచాయతీలకు అప్పగించేలా చర్యలు తీసుకోనున్నారు.
కోర్టు కేసులున్న ఆస్తుల విషయంలో తాత్కాలికంగా సర్వే ప్రక్రియను నిలిపివేయనున్నారు.
Details
జగన్ ఫొటో ఉన్న కార్డుల భవిష్యత్తు?
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ ఫొటోతో ముద్రించి పంపిణీ చేసిన ప్రోపర్టీ కార్డుల విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
పాత కార్డులను వెనక్కి తీసుకుని కొత్త డిజైన్‌లో ముద్రించి పంపిణీ చేయాలా? లేక వాటినే కొనసాగించాలా? అనే అంశంపై అధికారులంతా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే అత్యధికంగా ప్రజలు పాత కార్డులను తిరిగి ఇచ్చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో, ప్రభుత్వం వాటిని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.
తమ ఆస్తుల ధృవీకరణ పత్రంపై జగన్ ఫొటో ఎందుకు ఉండాలని పలువురు మండిపడుతున్నట్లు సమాచారం.
Details
ముందుచూపుతో ప్రణాళిక రూపొందించిన కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం స్వమిత్వ పథకానికి కొత్త ఊపునిచ్చేందుకు తొలుత మిగిలిన గ్రామాల్లో సర్వే పూర్తి చేసి, మూడు సంవత్సరాల్లో అన్ని యాజమాన్య హక్కులను ప్రజలకు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది.
కొత్తగా ముద్రించే కార్డులు పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఉండేలా సీఎం ఫొటో స్థానంలో ప్రభుత్వ లోగోను ఉంచనుంది.
పంచాయతీ ఆస్తులను కూడా స్పష్టంగా గుర్తించి అక్రమాలపై చర్యలు తీసుకునేలా వ్యవస్థను పటిష్ఠం చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.