LOADING...
Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం
మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం

Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మహిళా సమాఖ్య సభ్యులకు ప్రతేడాది రెండు చీరలు అందజేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా పర్యటనలో అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించిన సమావేశంలో కీలక ప్రకటనలు చేశారు. మహిళా సమాఖ్యలో 67 లక్షల మంది సభ్యులుండగా, వారికి ప్రభుత్వం రూ.1000 కోట్ల వ్యయంతో ప్రతి ఏడాదీ రెండు మంచి చీరలు అందజేస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి శిల్పారామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. తదుపరి ప్రణాళికల్లో భాగంగా 1000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంటును మహిళలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Details

స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చొరవ చూపాలి

ప్రతి జిల్లాలో ఒక స్థలంలో మహిళా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం ఒక బంక్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఉన్న స్కూళ్ల నిర్వహణ బాగుండేలా మహిళలు చొరవ చూపించాలని సీఎం సూచించారు. ఉపాధ్యాయుల కొరత లేదా వసతుల సమస్యలుంటే జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని, నిధుల విషయమై ప్రభుత్వ సాయమందిస్తామని హామీ ఇచ్చారు. అయితే నిధులు ఇచ్చినా నిర్వహణ సరిగా లేకపోతే ప్రయోజనం ఉండదని సీఎం స్పష్టం చేశారు. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహిస్తామో, బడులను కూడా అదే విధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.