
Nimisha Priya: నిమిష ప్రియకు ఊరట.. మరణశిక్ష అమలు వాయిదా..!
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు కొంత ఉపశమనం లభించినట్లు సమాచారం. ఆమెకు విధించిన మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసినట్లు భారత విదేశాంగశాఖ వర్గాలు తెలియజేశాయి. ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం జూలై 16నశిక్షను అమలు చేయాల్సి ఉండగా,చివరి క్షణంలో అక్కడి అధికారులు దాన్ని నిలిపివేసినట్లు సమాచారం. విదేశాంగ శాఖ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం,''ఈకేసు ప్రారంభమైనప్పటి నుంచే భారత ప్రభుత్వం నిమిష ప్రియకు అన్ని విధాలా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తోంది.ఆమె కుటుంబం, బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి సమస్యను పరిష్కరించుకునేలా కొంత గడువు ఇవ్వాలని యత్నించాం.స్థానిక జైలు అధికారులు,ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరంగా సంప్రదింపులు కొనసాగించాం. ఫలితంగా యెమెన్ అధికారులు మరణశిక్షను వాయిదా వేయడానికి అంగీకరించారు''అని తెలిపారు.
వివరాలు
నిమిష ప్రియ కుటుంబం బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్లు క్షమాధనం
ఇదిలా ఉండగా, బ్లడ్ మనీ అందుకోవడానికి బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత నాయకుడు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చర్చలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు సమాచారం.నిమిష ప్రియ కుటుంబం బాధిత కుటుంబానికి సుమారు ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.6 కోట్లు)క్షమాధనంగా ఇవ్వడానికి సిద్ధమైంది. బాధిత కుటుంబం అంగీకరిస్తే నిమిష ప్రియకు మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ కేసు నేపథ్యం చూడాల్సినపుడు,నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన నిమిష ప్రియా 2008లో యెమెన్ వెళ్లి అక్కడ ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు తిరిగి వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అనంతరం ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ ప్రారంభించాలనే లక్ష్యంతో తిరిగి అక్కడికి వెళ్లింది.
వివరాలు
మెహది నిమిషను ఆర్థికంగా,మానసికంగా వేధించాడు
కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం, స్థానిక వ్యక్తితో భాగస్వామ్యంగా వ్యాపారం ప్రారంభించాల్సి ఉండేది. దీంతో తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష ప్రియా-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా తీసుకొని అల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. తర్వాత తమ కుమార్తె సంప్రదాయ వేడుకల్లో పాల్గొనడం కోసం నిమిష ప్రియా కేరళకు వచ్చినప్పటికీ, వేడుకలు ముగిసిన వెంటనే తిరిగి యెమెన్‌కు వెళ్లిపోయింది. అయితే ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. ఈ పరిస్థితిని అదునుగా మలచుకున్న మెహది ఆమెను ఆర్థికంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడని నిమిష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భార్యగా గుర్తించి, ఆమె పాస్‌పోర్ట్ సహా ఇతర కీలక పత్రాలు లాక్కొన్నాడని కుటుంబం పేర్కొంది.
వివరాలు
సరిహద్దుల్లో నిమిషను అరెస్ట్ చేసిన పోలీసులు
అంతేకాదు, కుటుంబ సభ్యులతో మాట్లాడనీయకుండా అడ్డుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 2016లో మెహదిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు స్పందించలేదు. దీంతో 2017లో మత్తుమందు ఇచ్చి, అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్ట్ తిరిగి పొందాలనుకుంది. కానీ మత్తు మందు మోతాదు అధికమవడంతో మెహది మృతిచెందాడు. తర్వాత అతడి మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పడేసింది. అనంతరం అక్కడి నుండి సౌదీ అరేబియాకు పారిపోవడానికి యత్నించగా, సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.