Nitin Gadkari: కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి 19 సెకన్ల క్లిప్పింగ్‌ను తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేసినందుకు గాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ షేర్ చేసిన 19 సెకన్ల వీడియోలో నితిన్ గడ్కరీ ''గ్రామాల్లో ప్రజలు, పేదలు, రైతులు, కూలీలు అసంతృప్తితో ఉన్నారు. మంచి రోడ్లు, తాగునీరు, ఆస్పత్రులు, పాఠశాలలు లేకపోవడమే ఇందుకు కారణం''అని అంటున్నట్లు ఉంది. కాంగ్రెస్ షేర్ చేసిన వీడియో, గతంలో గ్రామీణ-పట్టణ వలసల గురించి గడ్కరీ మాట్లాడిన భాగాన్ని, రైతుల జీవితాలను మెరుగుపరచడానికి NDA ప్రభుత్వం చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడిన భాగాన్ని కత్తిరించింది.
సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది
వేరే సందర్భంలో తాను అన్న మాటలను పార్టీలో గందరగోళం నెలకొనేలా కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని గడ్కరీ మండిపడ్డారు. నితిన్ గడ్కరీ పంపిన లీగల్ నోటీసులో, "నా క్లయింట్ (గడ్కరీ) ఇంటర్వ్యూ పూర్తి కంటెంట్ తెలిసినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా సందర్భోచిత అర్థాన్ని దాచిపెట్టి, వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌ను ఉపసంహరించుకోవాలని, మూడు రోజుల్లో నితిన్ గడ్కరీకి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. పైన పేర్కొన్న షరతులను పాటించడంలో విఫలమైతే సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో హెచ్చరించారు.