
Bihar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. నితీష్ కుమార్ సర్కారు మరో కొత్త పథకం ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో మరికొన్నినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించేందుకు వరాల పంట కురిపిస్తోంది. ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలపై ప్రకటనలు చేసిన సీఎం.. తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. 125 యూనిట్ల లోపు వినియోగించిన కరెంటుకు వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నితీష్ కుమార్ చేసిన ట్వీట్
हमलोग शुरू से ही सस्ती दरों पर सभी को बिजली उपलब्ध करा रहे हैं। अब हमने तय कर दिया है कि 1 अगस्त, 2025 से यानी जुलाई माह के बिल से ही राज्य के सभी घरेलू उपभोक्ताओं को 125 यूनिट तक बिजली का कोई पैसा नहीं देना पड़ेगा। इससे राज्य के कुल 1 करोड़ 67 लाख परिवारों को लाभ होगा। हमने यह…
— Nitish Kumar (@NitishKumar) July 17, 2025
వివరాలు
గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచితం
''మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్ (Electricity) అందిస్తున్నాం. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఇకపై గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటును వినియోగించుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకువస్తున్నాం. అంటే, జూలై నెల కరెంటు బిల్లులను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయంతో బిహార్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.67 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి'' అని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.
వివరాలు
'కుటీర్ జ్యోతి' పథకం కింద సోలార్ ప్లాంట్లు ఉచితం
''మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని నిర్ణయించాం. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా, అత్యంత పేద కుటుంబాలకు 'కుటీర్ జ్యోతి' పథకం కింద సోలార్ ప్లాంట్లు ఉచితంగా ఇస్తాం. మిగతా కుటుంబాలకు వాటిని సబ్సిడీ ధరల్లో అందుబాటులోకి తీసుకురాగలమని భావిస్తున్నాం. రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నాం'' అని సీఎం వివరించారు.
వివరాలు
వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యం
అలాగే, ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే, మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇటీవల నీతీశ్ కుమార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిహార్‌లో శాశ్వత నివాసితులైన మహిళలకు, ప్రభుత్వ నియామకాలలో ప్రతి శాఖలోని అన్ని పోస్టులకు ఈ రిజర్వేషన్ వర్తించనుందని చెప్పారు. అలాగే, వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల మధ్య బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు అంచనా.