రాహుల్ గాంధీ విమర్శలపై స్మృతి ఇరానీ ఎదురుదాడి
లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎదురుదాడికి దిగారు. పార్లమెంట్‌లో తొలిసారి ఒక సభ్యుడు భారతమాత మరణం గురించి మాట్లాడినట్లు ఆమె చెప్పారు. దీనికి ప్రతిపక్ష 'ఇండియా' కూటమి సభ్యులు చప్పట్ల కొట్టడం సిగ్గు చేటు అన్నారు. ఇది దేశం మొత్తం చూస్తుందన్నారు. భారతదేశంలో ఇప్పుడు అవినీతి లేదని, అందుకే మీది భారత్ కాదన్నారు. భారతదేశం యోగ్యతను నమ్ముతుందని, రాజవంశాన్ని కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారికి క్విట్ ఇండియాకు బదులు 'అవినీతి క్విట్ ఇండియా', రాజవంశం క్విట్ ఇండియాను గుర్తుంచుకోవాలన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైందని కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించబడదు: రాహుల్
కాంగ్రెస్ పాలనలో బెంగాల్ నుంచి కశ్మీర్ వరకు మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై స్మృతి ఇరానీ మాట్లాడారు. 90వ దశకంలో తమపై జరిగిన అకృత్యాలకు న్యాయం కోసం కాశ్మీరీ పండిట్లు ఇంకా ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. భారత్ నుంచి మణిపూర్ విభజించబడలేదని, అది దేశంలో అంతర్భాగం అన్నారు. కాంగ్రెస్ హయాంలో 1984సిక్కు వ్యతిరేక అల్లర్లు, కశ్మీర్‌లో అశాంతి వంటి అంశాలను స్మృతి ఇరానీ లేవనెత్తారు. అవసరమైతే జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, సభ నుంచి పారిపోయిన వ్యక్తికి తాను ఒకటి చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఆర్టికల్ 370 ఎప్పటికీ పునరుద్ధరించబడదని స్పష్టం చేశారు. రాహుల్ సభలో తన స్పీచ్ అయిన వెంటనే రాజస్థాన్ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.