
Covid Vaccine: COVID-19 తర్వాత మరణాలకు వ్యాక్సిన్ కు సంబంధం లేదు: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
కోవిడ్ మహమ్మారి తర్వాత కొన్ని ఆకస్మిక మరణాల సంఘటనలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే, ఈ మరణాలు వ్యాక్సిన్ వల్లే జరిగాయని కొన్ని వాదనలు, ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, ఈ అనుమానాలకు భారత్‌లోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థలు అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఎయిమ్స్ (AIIMS) నిర్వహించిన లోతైన అధ్యయనాలు స్పష్టమైన సమాధానం చెప్పాయి. ఈ అధ్యయనాల ప్రకారం, కరోనా వ్యాక్సిన్లు,ఆకస్మిక మరణాల మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఇటీవల దేశంలో 40 సంవత్సరాల లోపు వయస్సు గల వారిలో గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
టీకాలు, గుండెపోటు మధ్య ఎలాంటి సంబంధం లేదు
కోవిడ్-19 టీకాలు తీసుకున్న యువతలో గుండె సమస్యలు వస్తున్నాయా అనే అనుమానాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. టీకాలు, గుండెపోటు మధ్య ఎలాంటి సంబంధం లేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాల్లో మరణాలకు ప్రధాన కారణాలుగా జీవనశైలి, ముందుగానే ఉన్న ఆరోగ్య సమస్యలు కీలకంగా నిలిచినట్లు తేలింది. ముఖ్యంగా 18 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ఆకస్మిక మరణాల వెనకనున్న కారణాలను పరిశీలించేందుకు ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) సంయుక్తంగా పని చేస్తున్నాయి.