Page Loader
D K Shivakumar: 'వేరే మార్గం లేదు': సిద్ధరామయ్యకు అండగా ఉంటా..శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
'వేరే మార్గం లేదు': సిద్ధరామయ్యకు అండగా ఉంటా..శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

D K Shivakumar: 'వేరే మార్గం లేదు': సిద్ధరామయ్యకు అండగా ఉంటా..శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2025
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మారబోతోందన్న ఊహాగానాలను సీఎం సిద్ధరామయ్య బుధవారం ఖండించారు. తాను ఐదేళ్లపాటు పూర్తిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని మీడియాతో స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై వెంటనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.

వివరాలు 

'నాకు ఇంకేం ఆప్షన్‌ ఉంది చెప్పండి?':డీకేఎస్‌

"ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఇంకేం చేయగలను? ఆయనకు మద్దతుగా నిలబడటం తప్ప ఇంకేం ఉంది?" అని డీకే శివకుమార్ అన్నారు. "నన్ను సీఎం చేయాలని నేను ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ ఒప్పించలేదూ. అలాంటిదే అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యల అవసరం ఎందుకు? పార్టీలో నాతోపాటు లక్షలాది మంది శ్రమిస్తున్నారు. పార్టీ తీసుకునే నిర్ణయమే నాకు ప్రాముఖ్యం," అంటూ తేల్చి చెప్పారు.

వివరాలు 

కఠినంగా స్పందించిన సిద్ధరామయ్య 

ముఖ్యమంత్రి పదవి మారబోతుందన్న ప్రచారంపై స్పందించిన సిద్ధరామయ్య, "ఊహాగానాలు అవసరం లేదు. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు సీఎం మార్పును చెప్పేవాళ్లు బీజేపీ, జేడీఎస్‌ ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా?" అంటూ మీడియాను ఎదుర్కొన్నారు. నేపథ్యం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవులు పంచుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఇద్దరూ వాటిని నిరాకరించారు.

వివరాలు 

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు

అయితే, తాజాగా జూన్ 29న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. వచ్చే రెండు, మూడు నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. దీంతో నాయకత్వ మార్పు చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. దీనిపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. సీఎం మార్పుపై నిర్ణయం పార్టీ హైకమాండ్ తీసుకుంటుందని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. "పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?" అని వ్యంగ్యంగా ప్రశ్నించింది. జేడీఎస్ కూడా కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ, సీఎం మార్పు జరిగే అవకాశమే ఉందంటూ వ్యాఖ్యానించింది. అయితే, ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

వివరాలు 

హుస్సేన్‌కు నోటీసులు ఇవ్వబోతున్నాం: డీకేఎస్‌ 

సీఎం మార్పుపై ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన డీకే శివకుమార్.. "మేమంతా సీఎం సిద్ధరామయ్య నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తున్నాం. ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు అనవసరం. ఆయనకు నోటీసులు జారీ చేస్తాం. వాటిపై సమాధానం కోరతాం. పార్టీ నిబంధనలకే ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.