Supreme Court: ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం
సుప్రీంకోర్టు ప్రైవేటు ఆస్తుల స్వాధీనం పై చారిత్రక తీర్పును వెలువరించింది. ప్రభుత్వాలు సామూహిక ప్రయోజనం కోసం అన్ని ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని కోర్టు 8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం మినహాయింపులు ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరుగా పరిగణించవచ్చా? అనే కీలక ప్రశ్నపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం కొన్నాళ్ల క్రితం కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం తీర్పు
''ప్రైవేటు ఆస్తులను సమాజ వనరుగా చూడటం తగదు..ఈ విధానాలు పరస్పర విరుద్ధం. ప్రస్తుతకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అవసరం'' అని అభిప్రాయపడింది. ''1950ల్లో భారతదేశ పరిస్థితుల ప్రాతిపదికన ఇప్పుడు వ్యాఖ్యానించకూడదు. అప్పట్లో జాతీయీకరణ జరిగేది. ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడుల పెరుగుదల ఉంది. కాబట్టి న్యాయస్థానం వ్యాఖ్యానం సమకాలీనంగా ఉండాలి'' అని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇంతేకాక, కోల్‌కతాలో పార్కు నిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకున్న ఆస్తి విషయంలో కూడా సుప్రీం వ్యాఖ్యానిస్తూ, ''చట్ట ప్రకారం పరిహారం చెల్లించినా సరైన విధానాలు పాటించబడలేదు.
ఆస్తి స్వాధీనం ముందుగానే తెలియజేయాలి
ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినా, రాజ్యాంగం అందుకు తగిన రక్షణ కల్పించింది. హడావుడి స్వాధీనాలు, సరైన పరిహారం లేని నిర్ణయాలు పౌరులకు నష్టపరిచే అవకాశం ఉండదు'' అని స్పష్టం చేసింది. ఆస్తి స్వాధీనం ముందుగానే తెలియజేయడం, తగిన సమయం ఇవ్వడం, అభ్యంతరాలను పరిష్కరించడం వంటి చర్యలు ప్రభుత్వాలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంది.