
Vijay: సారీ కాదు.. న్యాయం కావాలి'.. లాకప్‌డెత్‌పై విజయ్ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఒక సామాన్య పౌరుడిగా జీవిస్తున్న సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ మృతిచెందిన కస్టడీ మృతికేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. పోలీసులు అకారణంగా చితకబాదడంతో అతడు తీవ్ర గాయాలపాలై ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటనపై తీవ్ర స్థాయిలో ప్రజలంతా, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గంభీర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వమే ఓ పౌరుడి ప్రాణాన్ని తీసిందని వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల మధ్య సీఎం స్టాలిన్ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. ఈ కాల్ రికార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Details
విజయ్ నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ
తాజాగా ఈ కేసును పురస్కరించుకుని తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ స్వయంగా రోడ్డెక్కారు. చెన్నైలో భారీగా నిర్వహించిన ర్యాలీలో నల్ల చొక్కాలో ప్రత్యక్షమై.. సారీ కాదు, మాకు న్యాయం కావాలి అని ప్లకార్డుతో నడిచారు. పార్టీ స్థాపించిన తర్వాత ఆయన నేతృత్వంలో ఇది తొలి అతిపెద్ద ర్యాలీ కావడం గమనార్హం. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం తరచూ 'సారీ' చెప్పడం తప్పా, బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అజిత్ కుమార్ కేసుతో పాటు అన్నా యూనివర్సిటీలో జరిగిన అత్యాచారం కేసు వరకు.. రాష్ట్రంలో మరెన్ని దారుణాలు చూడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Details
కస్టడీ మృతుల సంఖ్య 24..?
విజయ్ ఆరోపణల ప్రకారం డీఎంకే ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 24 మంది కస్టడీలో మరణించారు. వీరందరికీ క్షమాపణలు చెప్పాలని, అజిత్ కుమార్ కుటుంబానికి ఇచ్చినట్లే మిగిలిన బాధిత కుటుంబాలకు కూడా పరిహారం అందించాలన్నారు. శివగంగై జిల్లాలో ఓ ఆలయంలో దొంగతనం జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుపై అజిత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ పేరుతో కస్టడీలో తీవ్రమైన హింసకు గురిచేశారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం అతని శరీరంపై 44 చోట్ల గాయాలున్నాయి. అంతర్గత రక్తస్రావమే మరణానికి కారణమని తేలింది. అంతేగాక అతడిని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.