Page Loader
Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ 
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా

Omar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్‌ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం జరిగిన మొదటి సమావేశంలో జమ్ముకశ్మీర్‌ మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, మంత్రులు సకీనా మసూద్ ఇటూ, జావేద్ అహ్మద్ రాణా, జావైద్ అహ్మద్ దార్, సతీష్ శర్మ పాల్గొన్నారు.

వివరాలు 

సిద్ధమైన తీర్మానం ముసాయిదా 

జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ తీర్మానం ముసాయిదాను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయడానికి ముఖ్యమంత్రి రెండు రోజుల్లో న్యూఢిల్లీకి వెళ్ళనున్నారు' అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ జమ్ముకశ్మీర్‌ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించకపోతే తమ పార్టీ కేబినెట్‌లో భాగం అవ్వదని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

వివరాలు 

 2019లో ఆర్టికల్ 370 రద్దు

"మేము రాజ్యాధికారం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషిన్‌ను సుప్రీంకోర్టు విచారించడానికి అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం త్వరలోదీనిని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని నేను భావిస్తున్నాను" అని అబ్దుల్లా చెప్పారు. ఇదిలా ఉండగా, 2019 ఆగస్టు 5న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసింది. కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తి కూడా రద్దు చేయబడింది. ఈ క్రమంలో, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించి, జమ్ము కశ్మీర్ మరియు లడఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.