
One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికలు... 2029 తర్వాతే సాధ్యమన్న నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే 'జమిలి ఎన్నికలు' అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అనే ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. అప్పుడు ప్రారంభిస్తేనే 2034లో జమిలి ఎన్నికలు జరగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని కాట్టాన్‌కొళత్తూరు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన 'ఒకే దేశం ఒకే ఎన్నిక' అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె, ఈ సందర్భంగా మాట్లాడారు.
Details
జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గే అవకాశం
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అనేది కొత్త ఆలోచన కాదని, ఇది చాలా కాలం క్రితమే వచ్చిన భావన అని ఆమె తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిందని పేర్కొంటూ, జమిలి ఎన్నికలు జరిగితే ఈ భారీ ఖర్చును తగ్గించవచ్చని చెప్పారు.
పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజల సొమ్ము ఆదా అవుతుందని వివరించారు.
అయితే ఈ అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
Details
అన్ని పార్టీలు మద్దతిస్తేనే అమలు
జమిలి ఎన్నికలు ఎవరి వ్యక్తిగత కార్యక్రమం కాదని, అన్ని పార్టీలు మద్దతిస్తేనే అమలులోకి వస్తుందని తెలిపారు. డీఎంకే పార్టీపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు.
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ - "తండ్రి కరుణానిధి స్వీయ చరిత్రలో జమిలి ఎన్నికల అవసరాన్ని గుర్తించి మద్దతు ప్రకటించారు.
కానీ ఇప్పుడు ఆయన కుమారుడు స్టాలిన్ మాత్రం రాజకీయ అవసరాల కోసం తండ్రి మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
ప్రజలు ఈ విషయం గమనించాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.