వినియోగదారులకు మరో కష్టం; భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు
ఇప్పటికే టమాట ధరలు పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మార్కెట్ విశ్లేషకులు మరో షాకింగ్ విషయం చెప్పారు. కొద్ది రోజుల్లో దేశంలో ఉల్లిపాయ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రధాన మార్కెట్‌లలో ఉల్లిపాయల సరఫరా తగ్గింది. త్వరలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో నిత్యం వాడే వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ధరలు పెరిగే జాబితాలో ముందు వరుసలో ఉల్లిపాయ ఉంది. ఇప్పటికే టమాట ధరలు ఆకాశానికి ఎక్కిన నేపథ్యంలో వంటిల్లు బడ్జెట్ భారీగా పెరిగింది. ఇదే సమయంలో ఉల్లిపాయ రేట్లు కూడా పెరిగితే వినియోగాలు, ముఖ్యంగా సామాన్య ప్రజానీకం వంటిల్లుకు తాళం వేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
కేంద్రం వద్ద 2,50,000టన్నుల ఉల్లి నిల్వలు
ఉల్లిపాయ ధరలు పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఓ ప్రభుత్వ అధికారి సానుకూల ప్రకటన చేశారు. టమాట మాదిరిగా ఉల్లిపాయ ధరలు పెరగే అవకాశం లేదని చెప్పారు. కేంద్రం దాదాపు 2,50,000 టన్నుల ఉల్లిపాయలను నిల్వ ఉంచినట్లు స్పష్టం చేశారు.సరఫరా తగ్గినప్పుడు నిల్వలను మార్కెట్‌లకు విడుదల చేస్తుందన్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో గతేడాది వార్షిక డిమాండ్‌లో కేవలం 70శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. దీని వల్ల ఉల్లికొరతను తీర్చడానికి ప్రభుత్వం నిల్వలు కూడా సరిపోవని నిపుణులు అంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఉల్లి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అక్టోబర్‌లో ఉల్లిరేటు ఆకాశన్నంటనున్నట్లు అంచనా వేస్తున్నారు.