Srisailam Dam: శ్రీశైలం ప్రాజెక్టు దిగువన గొయ్యి.. మరమ్మతులు పూర్తి చేయాలన్న ఎన్డీఎస్‌ఏ
ఈ వార్తాకథనం ఏంటి
కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి (ప్లంజ్ పూల్) ను మే నెలాఖరు నాటికి పూడ్చివేయాలని జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) సూచించింది.
గురువారం సంస్థ ఛైర్మన్ అనిల్ జైన్ ఢిల్లీలోని కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల తో కలిసి ప్లంజ్‌పూల్ మరమ్మతులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, డ్యాం సేఫ్టీ సంస్థ సీఈ ప్రమీల, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ మోహన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వరరావు, సీఈ ఖాదర్‌బాషా, ఎస్‌ఈ మోహన్‌కుమార్ హాజరయ్యారు.
వివరాలు
గతేడాదే దీనిపై నివేదిక
శ్రీశైలం ఆనకట్ట పునాది 380 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం ఏర్పడిన గొయ్యి 410 అడుగుల వరకు ఉందని గతంలో నిర్వహించిన హైడ్రో గ్రాఫిక్ సర్వే వెల్లడించింది.
గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రభావంతో ఈ గొయ్యి ఏర్పడిందని, దానిని తక్షణమే పూడ్చాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్‌ఏ ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టం చేసింది.
గతేడాదే దీనిపై నివేదిక అందించినప్పటికీ ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది.
వివరాలు
ఏపీ, తెలంగాణ అభిప్రాయాలు
ఆంధ్రప్రదేశ్: ప్లంజ్‌పూల్ పై సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ద్వారా అధ్యయనం చేపడుతున్నామని సమాధానం ఇచ్చింది.
తెలంగాణ: కృష్ణా నదిలో వరదలు పెరిగినప్పుడు ఈ గొయ్యి ప్రమాదకర స్థాయికి చేరుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
ముంబయి సముద్రతీరం కోత నివారించేందుకు ఉపయోగించే టెట్రా పాట్స్ ద్వారా మరింత కోతను అరికట్టవచ్చని సూచించింది.
వివరాలు
ప్రాజెక్టుల యాజమాన్యంపై వివాదం
తెలంగాణ: శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఏపీకి, నాగార్జునసాగర్ బాధ్యతలు తమకు అప్పగించినట్లు రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని గుర్తు చేసింది.
ఆంధ్రప్రదేశ్: రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపింది.
తెలంగాణ: కృష్ణా జలాల అంశం కేడబ్ల్యూడీటీ-2 విచారణ పరిధిలో ఉందని, ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడం సాధ్యమయ్యేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
వివరాలు
డ్రిప్ పథకానికి శ్రీశైలం చేర్చాలని ఏపీ డిమాండ్
ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న డ్రిప్ (ఆనకట్టల అభివృద్ధి పథకం) కింద శ్రీశైలం ప్రాజెక్టును చేర్చి నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఈ చర్చలను ఎన్డీఎస్‌ఏ అధికారిక మినిట్స్‌లో నమోదు చేయాలని తెలంగాణ కోరగా, దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది.
ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేసింది.